ఇగొచ్చె..అగొచ్చె.. రేపో మాపో వెళ్లిపోవ‌డం ఖాయం.. వేరుకుంప‌టి పెట్టిండ‌ట‌.. మామ‌కు అల్లుడి దెబ్బ త‌ప్ప‌దు.. ఇక గులాబీ గూటిలో భూకంప‌మే..! అబ్బ‌బ్బ‌బ్బా!  రోజూ ఇదొక ధారావాహిక సీరియ‌ల్‌లా తెలంగాణ రాజ‌కీయాల్లో కొన‌సాగుతోంది. ఒక్క‌రోజు స‌మావేశాల్లో, పేప‌ర్లో, టీవీల్లో క‌నిపించ‌క‌పోతే చాలు.. అదిగ‌దిగో చూశావా..?  విన్నావా..?  అదేమిటి.. ఆయ‌న క‌నిపించ‌డం లేదేమిటి..?  మ‌నం ఊహించింది నిజ‌మే..? ఎన్నిరోజులున్నా.. ఆయ‌న వెళ్లిపోవ‌డం మాత్రం ఖాయ‌మ‌బ్బా.. అంటూ న‌లుగురు క‌లిసిన‌చోట‌ ఒక‌టే ముచ్చ‌ట‌! గుస‌గుస‌ల‌కు గ‌స‌గ‌సాలు ద‌ట్టించిమ‌రీ చెప్పిందేచెప్పుకున్నారు.  కానీ.. ఇవ‌న్నీ గాలిముచ్చ‌ట్లేన‌ని, మామ‌కు తాను ఎప్పుడూ విధేయుడేన‌ని బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఆయ‌న చాటుకున్నాడు. దీంతో ఎన్నాళ్లుగానో ఆయ‌న రాక‌కోసం ఎదురుచూస్తున్న వారి ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. నిలువునా కూలిపోయాయి. మామ నుంచి అల్లుడిని విడ‌దీయం అంత‌సులువేం కాదుబాబోయ్‌..! అంటూ నోరుమూసుకుంటున్నార‌ట‌. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌రావు. 

 

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం టీఆర్ఎస్ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్‌కు హ‌రీశ్‌రావు అండ‌గా నిలిచారు. ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొంటూ అనేక సంక్లిష్ట ప‌రిస్థితులు సులువుగా టీఆర్ఎస్‌కు అనుకూలంగా మ‌లిచి అనూహ్య విజ‌యాల‌ను అందించారు హ‌రీశ్‌రావు. అయితే, కేటీఆర్ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత మామ‌, అల్లుడి మ‌ధ్య గ్యాప్ పెరుగుతోందంటూ ఒక ప్ర‌చారం మొద‌లైంది. ఇక టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను చేసిన త‌ర్వాత ఇక హ‌రీశ్‌రావు ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని, ఆయ‌న‌ను కేసీఆర్ పూర్తిగా ప‌క్క‌కు పెట్టార‌నే టాక్ బ‌లంగా వినిపించింది. ఇదే స‌మ‌యంలో బీజేపీ పెద్ద‌ల‌ను హ‌రీశ్‌రావు ర‌హ‌స్యంగా క‌లిశార‌ని, క‌మ‌లం గూటికి చేర‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఒక ద‌శ‌లో జోరుగా సాగింది. మ‌రోవైపు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కూడా త‌ర‌చూ హ‌రీశ్‌రావును టార్గెట్‌గా చేసుకుని మాట్లాడారు. అధికారం కోసం ఏదోఒక‌రోజు రోడ్డుమీద బావ‌బామ్మ‌ర్ది త‌న్నుకోవ‌డం ఖాయ‌మ‌ని అనేక మార్లు అన్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక మొద‌టి మంత్రివ‌ర్గంలో హ‌రీశ్‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంతో.. అదిగో చూశారా.. హ‌రీశ్‌ను మొత్త‌మే ప‌క్క‌కు పెట్టార‌ని అనుకున్నారు. కానీ.. ఇదే స‌మ‌యంలో కేటీఆర్‌కు కూడా ఆ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌లేద‌నే విష‌యాన్ని మ‌రిచిపోయారు. 

 

రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఏకంగా హ‌రీశ్‌రావుకు ఆర్థిక మంత్రిగా అవ‌కాశం ద‌క్క‌డంతో అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. ఇక ప్ర‌స్తుత అసెంబ్లీ స‌మావేశాల్లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టేముందు మంత్రి హ‌రీశ్‌రావు కేసీఆర్‌కు పాదాభివందనం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సీన్‌ను చూసి కొంద‌రు తీవ్ర ఇబ్బందికి గుర‌య్యార‌ట‌. మామ‌కు అల్లుడు దూర‌మ‌వుతుండ‌నుకుంటూ.. ఇలా సీన్ రివ‌ర్స్ అయిందేమిట‌ని కొంద‌రు క‌మ‌ల‌నాథులు, కాంగ్రెసోళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. ఇక టీడీపీలోగా.. టీఆర్ఎస్‌లో వెన్నుపోటు సీన్ ఉండ‌వ‌ని, మామ నుంచి అల్లుడిని లాగేసుకోవ‌డం క‌ష్ట‌మ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. పాపం క‌మ‌ల‌నాథులు.. ముందుముందు ఏం చేస్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: