ప్రేమ, పగ.. వారి జీవితాల్ని విషాద సుడిగుండంలోకి తోసేశాయి. కళ్లముందే భర్త హత్యకు గురయ్యాడు. భర్త హత్యకేసులో తండ్రిని శిక్షించాలని ప్రయత్నిస్తుంటే.. ఆయనే సూసైడ్ చేసుకున్నాడు. ఫలితంగా తల్లి ఒంటరైంది. భర్తలేని బాధంటో తనకు తెలుసంటున్న అమృత, తల్లి చెంతకు చేరుతుందా..?  వీళ్లిద్దరు ఇప్పుడు కలుస్తారా..? తన తండ్రి చివరి కోరికను కూతురు తీరుస్తుందా..?

 

రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకేసు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.  వ్యాపారి మారుతీరావు దంపతుల ఒక్కగానొక్క కూతురు అమృత... .. 2018 లో ప్రణయ్‌ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది..తన గారాలపట్టి అమృత..  ఓ దళితున్ని పెళ్లి చేసుకోవడాన్ని మారుతీరావు సహించలేకపోయాడు.  ప్రణయ్‌ను అడ్డు తొలిగిస్తే, కూతురు తిరిగి తన చెంతకు చేరుతుందని భావించాడు.. 2018 సెప్టెంబర్‌ 14 న ఓ సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు మారుతీరావు. అయితే అప్పటికే తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న అమృత.. భర్తను హత్యచేయించిన తండ్రిపై కసి పెంచుకుంది. తండ్రితో పాటు బాబాయ్‌, సుపారీ గ్యాంగ్‌ పై కేసు పెట్టి న్యాయ పోరాటం చేస్తోంది..

 

ప్రణయ్ హత్య కేసు చివరి దశకు చేరుకుంది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ , కేసుల్లోంచి బయటపడటం కష్టమేనని మారుతీరావుకు అర్థమైంది. హైదరాబాద్‌కు వచ్చి న్యాయవాదిని కలిసిన తర్వాత  ఆర్యవైశ్య భవన్‌లోని రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు దూరంగా ఉండటం, భర్త సూసైడ్ చేసుకోవడంతో మారుతీరావు భార్య గిరిజ ఒంటరైపోయింది. కట్టుకున్నవాడు హత్యకు గురయ్యాడు. తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న తల్లి చెంతకు అమృత చేరుతుందా అన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

 

ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి శ్రవణ్‌, అమృతకు బాబాయ్‌.. అన్న పదకొండు రోజుల కార్యక్రమాలు పూర్తయితే తాము ఇంటి నుంచి వెళ్లిపోతామని ... అప్పుడు తల్లి, కూతుళ్లు కలుసుకుంటే తమకేమి అభ్యంతరం లేదని అంటున్నాడు.. తల్లి, కూతుళ్లను విడదీసేంత రాక్షసత్వం తనకు లేదని స్పష్టం చేస్తున్నాడు..
తండ్రి కట్టుబాట్లు తల్లికి లేవు, ఎలాంటి అడ్డుగోడలు ఇప్పుడు లేవు.. తన భర్త హత్యకు తల్లికి ఏ మాత్రం సంబంధం లేదు. ఇప్పుడు ఇద్దరికి తోడు కావాల్సి ఉంది.. మరి ఇలాంటి సమయంలో తల్లికి అమృత అండగా నిలబడుతుందా? భవిష్యత్తులో తల్లీకూతురు కలిసి జీవించే పరిస్థితి ఉంటుందా.. ఇప్పుడు అందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు రేగుతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: