మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదురు పాకాన పడింది. 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో... కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. మరోవైపు... కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ కండువా కప్పుకొని... రాజ్యసభ ఎన్నికల బరిలో నిలబడబోతున్నారు. ఇంకోవైపు... హోలీ వేడుకల కోసం లక్నో వెళ్లిన మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ తాండన్‌... రేపు రాజభవన్‌కు రానున్నారు. కమల్‌నాథ్‌ను బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించే అవకాశం ఉంది. 


 
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలో పడింది. తాజా పరిణామాలు చూస్తుంటే... కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనిపిస్తోంది. 15 నెలల విరామం తర్వాత మధ్యప్రదేశ్‌ తిరిగి బీజేపీ వశం కాబోతోంది. కొంత కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పడంతో ఒక్క సారిగా సీన్‌ మారిపోయింది. సింధియా వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేలు కూడా  కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 

 

ఇంకోవైపు... అసెంబ్లీ స్పీకర్‌ ప్రజాపతిని భోపాల్‌లోని అతని నివాసం కలిసిన బీజేపీ నేత నరోత్తమ్‌ మిశ్రా, ప్రతిపక్ష నేత గోపాల్‌ భార్గవ్‌... 19 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖల్ని అందజేశారు. అయితే, విధాన సభ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ స్పష్టం చేశారు.  

 

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సర్కార్‌ మైనార్టీలో పడడంపై గవర్నర్‌ లాల్జీ తాండన్‌ స్పందించారు. తాను రాజ్‌భవన్‌కు చేరుకున్నాక దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారాయన. హోళీ వేడుకల్లో పాల్గొడానికి ప్రస్తుతం లక్నో వచ్చిన గవర్నర్‌ లాల్జీ తాండన్‌...  రేపు భోపాల్‌ చేరుకునే అవకాశం ఉంది.

 

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లున్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు BSP సభ్యులు, ఒక SP ఎమ్మెల్యే మద్దతు కాంగ్రెస్‌ ఉంది. మరోవైపు బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన చెరో ఎమ్మెల్యే మరణించడంతో... రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో సభలో సభ్యుల సంఖ్య 228కి పడిపోగా, మెజార్టీ  మార్క్‌ 115గా ఉంది. కాని... 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించినా... సీన్‌ పూర్తిగా మారిపోతుంది. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 211కు తగ్గిపోతుంది. ఫలితంగా మెజార్టీ మార్క్‌ 106 అవుతుంది. 

 

నిన్న కమల్‌నాథ్‌ ఇంట్లో జరిగిన CLP సమావేశానికి 88 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు నలుగురు ఇండిపెండెంట్లు హాజరయ్యారు. 22 మంది రెబల్స్‌తో పాటు ఇద్దరు BSP, ఒక SP ఎమ్మెల్యే హాజరుకాలేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ బలం 97కి మించదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలుండే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఎవరూ చేజారిపోకుండా కమలనాథులు జాగ్రత్త పడుతున్నారు. వీరందరిని హర్యానాకు తరలించే అవకాశాలున్నాయి.

  

మరోవైపు... కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా... బీజేపీ తీర్థం పుచ్చుకోడానికి సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. కాగా, ఇవాళ బీజేపీలో చేరి... ఆ వెంటనే బీజేపీ తరఫున రాజ్యసభకు నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: