త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ ఉంటుందా? లేదంటే ఏకంగా పునర్‌వ్యవస్థీకరణ చేస్తారా? మండలి రద్దు, ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపడంతో వారి స్థానంలో వచ్చే కొత్తమంత్రులెవరనే అసక్తి నెలకొంది. కేబినెట్ స్థానాల భర్తీతోనే జగన్ సరిపెడతారా.. లేక ప్రక్షాళన దిశగా అడుగులేస్తారా.. అనేది హాట్ టాపిక్‌గా మారింది.


మూడు రాజధానుల నిర్ణయం తర్వాత ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మండలిరద్దుతో  డిప్యూటీ సీఎం పిల్లి  సుభాష్ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణలకు న్యాయం చేసేందుకు రాజ్యసభ టికెట్లిచ్చారు జగన్. ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖాళీ అయ్యే స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు స్థానాలను భర్తీ చేయడం పైకి మామూలుగానే కనిపిస్తున్నా.. ఒకదానికొకటి ముడిపడిన అంశాలు. వీటిని భర్తీ చేయాలంటే ఏపీ సీఎం జగన్‌ ..చాలా ఈక్వేషన్లను సెట్‌ చేయాల్సి ఉంటుంది.

 

ప్రస్తుతం మంత్రి వర్గం నుంచి ఇద్దరు బీసీలు తప్పుకుంటున్నారు కాబట్టి తిరిగి ఆ స్థానాలను బీసీతోనే భర్తీ చేయాలని జగన్‌ భావిస్తే బీసీ-మత్స్యకార కాంబినేషన్‌ కరెక్ట్‌గా ఉంటుందనే చర్చజరుగుతోంది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ది తూర్పు గోదావరి జిల్లా, మోపిదేవి వెంకటరమణది గుంటూరు జిల్లా. ఇప్పుడు ఈ రెండు జిల్లాలకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలతో .. మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశాలున్నాయి. పిల్లి సుభాష్‌ది శెట్టి బలిజ సామాజిక వర్గం కాగా, మోపిదేవిది మత్స్యకార సామాజిక వర్గం. రాష్ట్రంలో ఈ రెండు  సామాజిక వర్గాలకు బలమైన ఓట్లు ఉన్నాయి. వీరిని సంతృప్తి పరచాల్సి ఉంటుంది. వీటిన్నిటిని బేరీజు వేసుకుని జగన్‌ మంత్రివర్గ కూర్పు ఏ విధంగా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

 

శెట్టి బలిజకు న్యాయం చేయాలంటే .. పిల్లి సుభాష్‌ను ఎలాగూ రాజ్యసభకు పంపుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ స్థానాన్ని కూడా శెట్టి బలిజలకు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరుస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి బీసీ, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కు ఛాన్స్‌ దక్కుతుందా..? అనే చర్చ నడుస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో బీసీ సామాజిక వర్గం నుంచి చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ ఒక్కరే కనిపిస్తున్నారు. అయితే ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకుంటే సదురు నియోజకవర్గంలో లేనిపోని తలనొప్పులు ఎదురయ్యే ప్రమాదం కన్పిస్తున్నాయి. చిలకలూరి పేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుంటానని జగన్ గతంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మండలి రద్దవుతుండటంతో మర్రి రాజశేఖర్‌కు ఏ పదవీ దక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్నది ఆసక్తిరేపుతోంది. జిల్లాలో కొన్ని ఈక్వేషన్లు మారి అంబటి, పిన్నెల్లిల్లో ఒక్కరికి అవకాశం వచ్చినా రావచ్చనే ప్రచారం జరుగుతోంది.

 

ఇదే సందర్భంలో మరో చర్చ తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రుల పనితీరును బేరీజు వేసి.. కొందరు మంత్రులకు ఉద్వాసన పలికే దిశగా కూడా జగన్ ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతమున్న మంత్రుల్లో సుమారు ఐదుగురు మంత్రులపై వేటు పడే సూచనలు కన్పిస్తున్నాయని టాక్. ఇప్పటికే వీక్‌గా ఉన్న మంత్రుల జాబితాను జగన్ సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరు.. రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో మంత్రి పేరూ ప్రధానంగా వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: