తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడుని ఎంపిక చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని అధ్యక్షుడుగా నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఎప్పటి నుంచో తెలంగాణకు కొత్త అధ్యక్షుడుని నియమిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అధ్యక్షుడుగా కొనసాగిన లక్ష్మణ్ స్థానంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై తీవ్ర చర్చలు జరిగాయి.

 

ఇక ఈ అధ్యక్ష పదవికి చాలామంది నేతలు ప్రయత్నాలు చేశారు. లక్ష్మణ్ తనకు మరోసారి అవకాశం కల్పించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేయగా, ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, పార్టీ సీనియర్లు చింతల రామచంద్రారెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా ప్రయత్నాలు సాగించారు. అలాగే పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి కూడా తమ వంతు ప్రయత్నాలు కొనసాగించారు.

 

అయితే ఎంతమంది ప్రయత్నాలు చేసిన, బీజేపీ అధిష్టానం మాత్రం బండి సంజయ్ వైపే మొగ్గుచూపింది. పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న సంజయ్...2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్, ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. ఈ క్రమంలోనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంజయ్‌కు కరీంనగర్ ఎంపీ టికెట్ కేటాయించారు.

 

ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా ఉన్న, ప్రత్యర్ధిగా టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ బరిలో ఉన్న సంజయ్ మాత్రం కసితో ప్రచారం చేశారు. పైగా దేశ వ్యాప్తంగా మోడీ గాలి కూడా తొడవ్వడంతో సంజయ్ అద్భుత విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఓ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే, మరోవైపు తన ఎంపీ నిధులతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా అన్నిరకాలుగా కష్టపడుతున్న సంజయ్‌కు అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించి న్యాయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: