తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి అధికార పక్షం వైసీపీ నేతలు చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై జరిగిన దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు.  తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ నేత మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కావాలనే చంద్రబాబు అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. 

 

కొంత కాలంగా టీడీపీకి అధికార పక్షంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటుందని అన్నారు.  గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై జరిగిన దాడులపై బొత్స స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుందని.. అందుకే రాష్ట్రంలో కావాలనే చంద్రబాబు అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికలు సందర్భంగా.. అన్ని పార్టీలూ బిజీగా ఉన్నాయి. ఒక్క టీడీపీనే రాష్ట్రంలో అలజడి సృష్టించాలని అనుకుంటోంది. కావాలనే చంద్రబాబు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారు.  ప్రజల్లో తమపై పూర్తి నమ్మకం పోయిందని చంద్రబాబు కి అర్థమైనట్టుంది.. అందుకే వంకర బుద్ది ప్రదర్శిస్తున్నారని అన్నారు. 

 

కాగా, స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని టీడీపీకి అర్థమైపోయింది. అందుకే కావాలని కార్లు తీసుకుని అలజడి సృష్టించడానికి మాచర్ల వెళ్లారన్నారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న కలిసి 10 కార్లలో మాచర్ల వెళ్లారు. పది కార్లలో ఊరేగింపుగా వెళ్తూ.. యాక్సిడెంట్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహించారు.  ప్రజల ఆగ్రహం మాత్రే అక్కడ కనిపించిందని.. వారిపై వైసీపీ నేతలు దాడులు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.  ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే మాచర్లకు చంద్రబాబు గూండాలను పంపారని ఆరోపణలు చేశారు బొత్స సత్యనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: