తెలంగాణను కలవరపెట్టిన తొలి కరోనా పాజిటివ్ కేసును వైద్యులు తగ్గించారు.  దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు లేవని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ఇకపై విదేశాల నుంచి వచ్చే ఎవరిని కూడా స్క్రీనింగ్ చేయకుండా బయటికి వదిలేది లేదని మంత్రి స్పష్టంచేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు వ్యాధి తగ్గడంతో వైద్యశాఖతో పాటు జనం సైతం ఊపిరి పీల్చుకున్నారు.

 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కేసులు, ప్రస్తుతం భారతదేశంలో కూడా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తెలంగాణను కలవర పెట్టిన కరోనాను వైద్యులు సమర్థంగా ఎదుర్కుంటున్నారు. వ్యాధి సోకిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కోలుకుంటున్నాడు. అతడికి వ్యాధి లక్షణాలు తగ్గడంతో పాటు పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. దాదాపు పది రోజుల నుంచి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వ్యాధి తగ్గడంతో... తెలంగాణలో పాజిటీవ్ కేసులు లేవని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

 

తెలంగాణలో మొదటి కేసు నెగిటివ్ వచ్చినప్పటికీ, కరోనా ను ఎదుర్కోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది ప్రభుత్వం. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల తెలిపారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని  స్క్రీనింగ్ చేయకుండా వదిలేది లేదని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు స్క్రీనింగ్ చేస్తుండగా ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్‌లో పెడతామన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో ఒక స్టాండింగ్ థర్మో స్క్రీనింగ్‌తో పాటు మరో మూడు హ్యాండ్లింగ్ స్క్రీనింగ్ ఉన్నాయని అదనంగా మరో రెండు థర్మో స్క్రీనింగ్ లను కొనేందుకు ఆర్డర్  ఇచ్చినట్లు తెలిపారు. 

 

తెలంగాణలో కరోనా టెస్టింగ్ చేసేందుకు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున ఉస్మానియలోనూ పరీక్షలు చేయనున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: