తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ పుట్టినగడ్డ కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామం అని తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఇక ఆయన పుట్టిన నిమ్మకూరు గ్రామం పామర్రు నియోజకవర్గంలో ఉంటుంది. అయితే ఎన్టీఆర్ పుట్టిన ఈ పామర్రు నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకు గెలుపు బాటపట్టలేదు. 2009లో ఏర్పడిన పామర్రు నియోజకవర్గంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి డి‌వై దాస్, టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఉప్పులేటి కల్పనపై విజయం సాధించారు.

 

ఇక 2014లో ఉప్పులేటి కల్పన వైసీపీలోకి వెళ్ళిపోయి, ఆ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఇటు వచ్చేశారు.  2019 ఎన్నికలోచ్చేసరికి కల్పన టీడీపీ నుంచి బరిలో దిగి వైసీపీ నుంచి పోటీ చేసిన కైలే అనిల్ కుమార్ చేతిలో దాదాపు 30 వేలపైనే మెజారిటీతో ఓడిపోయారు. ఈ విధంగా టీడీపీ మూడుసార్లు ఎన్టీఆర్ అడ్డాలో గెలుపు రుచి చూడలేదు.

 

అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఈసారి ఆధిక్యం కూడా వైసీపీదే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ తరుపున కల్పన పెద్దగా హార్డ్ వర్క్ చేయకపోవడంతో, ఈ సారి కూడా అనిల్‌దే పైచేయి కానుందని తెలుస్తోంది. కాకపోతే వన్‌సైడ్‌గా విజయం సాధించడం వైసీపీకి అంత సులువు కాదు. ఇక్కడ టీడీపీ కేడర్ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల, గట్టి పోటీనిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పామర్రు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, మొవ్వ, పెదపారుపూడి మండలాలు ఉన్నాయి.

 

పామర్రులో వైసీపీకే ఆధిక్యం ఉంది. అటు పెదపారుపూడిలో టీడీపీకి కాస్త పట్టుంది. ఇక మిగిలిన రెండు మండలాల్లో హోరాహోరీ పోరు జరిగేలా కనిపిస్తోంది. అయితే రాజధాని ప్రభావం గానీ ఈ స్థానిక ఎన్నికలపైన పడితే టీడీపీకే కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశముంది. అలా కాకుండా రాజధాని ప్రభావం లేకపోతే వైసీపీ మెజారిటీ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: