ప్రత్తిపాటి పుల్లారావు...చిలకలూరిపేట నియోజకవర్గంలో తిరుగులేని నేత. టీడీపీలో ముఖ్య నేతగా ఉన్న ప్రత్తిపాటి చిలకలూరిపేట నుంచి 1999, 2009, 2014 ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించారు. 2004 ఎన్నికల్లో కేవలం 200 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఇక 2014లో గెలిచాక చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈ విధంగా తిరుగులేని నాయకుడుగా ఉన్న ప్రత్తిపాటికి 2019 ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది.

 

మొదట ఆయన అనుచరురాలుగా నడుచుకున్న విడదల రజనినే ప్రత్యర్ధిగా నిలబడి ప్రత్తిపాటిని ఓడించారు. విడదల రజని మొదట టీడీపీలో చేరి, ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చి, టికెట్ తెచ్చుకుని సూపర్ విక్టరీ కొట్టారు. అయితే ప్రత్తిపాటిని ఓడించడంతో రజని క్రేజ్ ఆమాంతం పెరిగిపోయింది. పైగా తనదైన వాక్చాతుర్యంతో అసెంబ్లీలోగానీ, బయట గానీ దుమ్ములేపుతున్నారు. ఇక ఈ 9 నెలల్లో ఎమ్మెల్యేగా బాగానే రాణించారు. నియోజకవర్గంలో పనులు చేయడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.

 

అయితే ఈ విధంగా దూకుడు కనబరుస్తున్న రజని...స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రత్తిపాటికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో మెజారిటీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలు గెలిచి సత్తా చాటాలని అనుకుంటున్నారు. అటు ప్రత్తిపాటి కూడా టీడీపీ అభ్యర్ధులని గెలిపించడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. కాకపోతే అమరావతి ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణల్లో చిక్కుక్కున్న ప్రత్తిపాటి ఇమేజ్ ఈ మధ్య కాస్త దెబ్బతింది. ఆ ప్రభావం స్థానిక సంస్థల్లో కనిపించే అవకాశముంది. ఇక ఇదే రజనికి అడ్వాంటేజ్ కానుంది.

 

కాగా, పేటలో నాదెండ్ల, చిలకలూరిపేట రూరల్, ఎడ్లపాడు మండలాలు ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి. అటు చిలకలూరిపేట మున్సిపాలిటీలో కూడా టఫ్ ఫైట్ నడవొచ్చు. కానీ మున్సిపాలిటీలో వైసీపీకే కాస్త విజయావకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మండలాల్లో మెజారిటీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడొచ్చు. మొత్తానికైతే ప్రత్తిపాటికి రజని మళ్ళీ చెక్ పెట్టేలా కనిపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: