గంటా శ్రీనివాసరావు గండరగండడు. రాజకీయ ఎత్తులు వేయడంలో సిధ్ధహస్తుడు.  విశాఖ జిల్లా రాజకీయాల్లో చాణక్య నీతితో రెండు దశాబ్దాలుగా నెగ్గుకువస్తున్న గంటా లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తనదైన రాజ‌కీయాన్ని చూపిస్తున్నారు. తానేంటో మళ్ళీ నిరూపించుకునే వ్యూహాన్ని ఆయన పక్కాగా అమలుచేస్తున్నారుట.

 

గంటా తన ఉత్తర నియోజకవర్గంలో జనసేన, బీజేపీ కూటమితో సొంతంగా పొత్తులు కుదుర్చుకుంటున్నారు. ఇందులో టీడీపీ హై కమాండ్ ప్రమేయం కూడా లేకుండా అన్నీ తానై పావులు కదుపుతున్నారు. మాకు మీరూ, మీకు మేము అన్న తరహాలో వారితో కొత్త పొత్తులకు తెర తీస్తున్నారు. 

 

ఉత్తర నియోజకవర్గంలో మొత్తం 17 వార్డులు ఉన్నాయి. అందులో జనసేనకు రెండు, బీజేపీకి రెండు వార్డులు పొత్తులో భాగంగా వదిలేసి మిగిలిన వాటిలో టీడీపీని గెలిపించుకోవడానికి గంటా కొత్త ఎత్తుగడలే వేస్తున్నారు. అంటే పదమూడు మంది కార్పోరేటర్లను తన వద్ద ఉంచుకుంటే రేపటి రోజున జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ చాలకపోతే తన వారి అవసరం అవుతుందని, తాను కింగ్ మేకర్ అవుతానని గంటా గట్టి ప్లానే వేశారు.

 

అయితే ఈ ప్లాన్ అంతా చంద్రబాబుకు తెలిసిపోవడంతో ఆయన బ్రేక్ వేశారని భోగట్టా. పార్టీలో ఎవరూ వ్యక్తిగత హోదాల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోవద్దని, అందునా బీజేపీతో అసలు పొత్తులు వద్దని బాబు గట్టి వార్నిగే ఇచ్చారని అంటున్నారు. దాంతో గంటా పొలిటికల్ స్టోరీ మొత్తం రివర్స్ అయిందట. ఏది ఏమైనా లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో దిట్ట అయిన గంటా వైసీపీకి, బాబుకు చుక్కలు చూపించేలా మరో ప్లాన్ వేస్తారని అనుచరులు అంటున్నారు.

 

ఏది ఏమైనా ఆకుకు అందకుండా పోకకు పొందకుండా అన్న చందాన అధిష్టానానికి చిక్కకుండా గంటా తనదైన రాజకీయం చేయడంతో ఆయన్ని నమ్మాలా, మానాలా అన్నది బాబుకు ఏ మాత్రం అర్ధం కావడంలేదుట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: