కడప జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతోంది. ఇటీవలే కడప జిల్లాలో కీలక టీడీపీ నేత, జగన్ ను అనేకసార్లు ఎన్నికల్లో ఢీకొన్న నాయకుడు సతీశ్ రెడ్డి వైసీపీలో చేరారు. ఇప్పుడు మరో కీలక నేత.. జగన్ కు గతంలో బద్దశత్రువుగా ఉన్న రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

 

 

టీడీపీ నేతలు అంటున్నట్లుగా.. ఎవరో భయపెడితేనో.. ఇంకెవరికో భయపడో.. వైయస్‌ఆర్‌ సీపీలో చేరలేదని, కార్యకర్తలందరితో సమావేశమైన తరువాత స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని రామ సుబ్బారెడ్డి చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిని కావాలని వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని రామసుబ్బారెడ్డి అన్నారు.

 

 

జగన్ కడప జిల్లా అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని... జమ్మల మడుగులో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, విప్లవాత్మక నిర్ణయాలు, ప్రతి గడపకు ప్రతి సంక్షేమ పథకం అందిస్తున్నారని రామ సుబ్బారెడ్డి అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో నిలిచిపోయే కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్తున్నారన్నారు.

 

 

స్థానిక సంస్థల ఎన్నికలను వైయస్‌ఆర్‌ సీపీ స్వీప్‌ చేస్తుందని రామ సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు. జగన్ కమిట్‌మెంట్‌తో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం ఆ పార్టీ కోసం పనిచేసిందని, చిన్నాన్న పొన్నపరెడ్డి శివారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని రామ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. దశాబ్దాల పాటు రాజకీయంగా టీడీపీలో ఉంటూ ఆ పార్టీ కోసం ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కొన్నామని రామ సుబ్బారెడ్డి వివరించారు. జగన్‌ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని, ప్రతి కార్యకర్త నిర్ణయం మేరకు మనస్ఫూర్తిగా వైయస్‌ఆర్‌ సీపీలో చేరానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: