రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఏపీలో ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల‌కు అధికార వైయస్సార్సీపీ తరపున అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసేశారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానిల పేర్ల‌ను రాజ్యసభకు జ‌గ‌న్ ఓకే చేశారు. ఎలా చూసినా... ఆ నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలో పడడం ఖాయమే. అయిన‌ప్ప‌టికీ, రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేయనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎస్సీ అభ్యర్థి వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్ధిగా నిలబెడుతున్నామని వెల్లడించారు. త‌మ ఓట్లు తామే వేసుకుంటామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

 

కాగా, టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబుపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. రాజ్యసభ సభ్యుల ప్రక్రియలో  గెలవలేమని తెలిసి కూడా  చంద్రబాబు బీ ఫారం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. సీఎం జగన్  త‌మ పార్టీ రాజ్యసభ సభ్యులకు బీ ఫారంలు ఇవ్వడం చూసిన చంద్రబాబు పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ప్రవర్తిస్తున్నాడని బౌల‌శౌరి వ్యాఖ్యానించారు. ``చంద్రబాబు బీ ఫారంలు ఇస్తానని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు బాబుకు భయపడి పార్టీ కార్యాలయానికి రాకుండా పారిపోతున్నారు`` అని ఎద్దేవా చేశారు.

 

తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ తప్ప ఎవ్వరు వెళ్లడం లేదని బాల‌శౌరి ఎద్దేవా చేశారు. `రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే కోరిక అంత‌గా ఉంటే...బీ ఫారం ఇవ్వాల‌నే మోజు ఉంటే....తెలుగుదేశం పార్టీలో పని లేకుండా ఉన్న మీ త‌న‌యుడు లోకేష్ కు రాజ్యసభ సభ్యుడిగా  బీ ఫారం ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా?`` అంటూ చంద్ర‌బాబుపై బౌల‌శౌరి కామెంట్ చేశారు. పార్టీ అభ్య‌ర్థులు  పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానిలు సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా బీఫారంలు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారితో ఉన్న ఎంపీ బౌల‌శౌరి అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: