కరోనా వైరస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 4వేల మందికిపైగా చనిపోగా, ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య 3వేలు దాటింది. ఇక 100కుపైగా దేశాల్లో సుమారు 1.15 లక్షల మంది బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాణాంతక వైరస్‌.. మనుషుల ప్రాణాల్నేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ మింగేస్తున్నదని యూఎన్‌ ఏజెన్సీ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే కనిష్ఠంగా 1 ట్రిలియన్‌ డాలర్లు.. గరిష్ఠంగా 2 ట్రిలియన్‌ డాలర్ల మేర ప్రపంచ ఆదాయం క్షీణించవచ్చని తెలిపింది.

 

అయితే, కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుండడం, రూపాయి బలహీన పడడం వంటి కారణాలతో బంగారం ధర రూ.401 తగ్గి రూ.44,014కు పడిపోయింది. గత ఐదునెలల కనిష్టానికి డిమాండ్ తగ్గడంతో డీలర్లు డిస్కౌంట్ ఇస్తుండడం వల్ల ఇలా జరిగింది. అయితే ఈ ధర తరుగుదల తాత్కాలికమేనని వ్యాపార సంఘాలు అంటున్నాయి. గుడిపాడ్వా లేదా అక్షయ తృతీయ నాటికి బంగారం మళ్లీ పుంజుకుని 50 వేల మార్కును తాకవచ్చని చెప్తున్నారు. 

 

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ ముడి చమురు వినియోగం భారీగా తగ్గిపోయింది. ప్రపంచ ముడి చమురు వినియోగదారుల్లో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోయి క్రూడ్‌ ధరలు విపరీతంగా దిగజారాయి. సోమవారం బ్యారెల్‌ ముడి చమురు ధర 30 డాలర్ల దగ్గర్లో కదలాడినది తెలిసిందే. మొత్తానికి ఏ ఉత్పత్తి తయారుచేసినా ప్రపంచం మీదికి వదిలే చైనా.. తమ దేశంలో పుట్టిన కరోనా వైరస్‌నూ ఇతర దేశాలకు అంటించింది. దీంతో ఇప్పుడు అన్ని దేశాలూ లబోదిబోమంటున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్ర స్థాయిలో నష్టపోగా, ఇటలీ, దక్షిణ కొరియా తదితర దేశాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే చైనాయేతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆదాయం 220 బిలియన్‌ డాలర్లు పడిపోవచ్చంటున్న యూఎన్‌ ఏజెన్సీ.. భారత్‌కు 348 మిలియన్‌ డాలర్ల (రూ.2,569 కోట్లు) నష్టం రావచ్చని అంచనా వేస్తున్నది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: