స్థానిక ఎన్నికల సమరంలో వైసీపీ నాయకులు అనుసరిస్తున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. చివరకు వైసీపీ సానుభూతి పరులు కూడా సమర్థించుకోలేని తరహాలో వైసీపీ స్థానిక నాయకులు ప్రవర్తిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి మాచర్ల ఘటనలో వైసీపీ నాయుకులు వ్యవహరించిన తీరు.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి.

 

 

నామినేషన్లు వేసేందుకు వచ్చే విపక్షాల నాయకులపై దాడులు చేయడం, నామినేషన్ల పత్రాలు లాక్కుపోవడం, కొన్ని చోట్ల కిడ్నాపులు.. వంటి ఘటనలు వైసీపీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ నాయకులు ఈ స్థాయిలో రెచ్చిపోవాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే టీడీపీ నాయకులు చాలా జిల్లాల్లో చేతులెత్తేశారు. దీనికి తోడు జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో మంచి పేరే తీసుకొచ్చాయి.



అన్నివిధాలుగా అనుకూలంగా ఉన్న సమయలోనూ వైసీపీ నాయకులు తమ కండ బలం చూపించే ప్రయత్నం చేయడం పార్టీకి ఏమాత్రం మంచిది కాదు. ఇక మాచర్ల వంటి ఘటనలు పునరావృతమైతే... దీన్ని టీడీపీ అందిపుచ్చుకునే అవకాశం ఉంది. అప్పుడు స్థానిక సంస్థల్లో బ్రహ్మాండంగా గెలిచినా... అది అరాచకంతో గెలిచిన గెలుపుగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి.



దుడ్డుకర్రలతో కార్లపై దాడులు చేయడం, రక్తమొచ్చేలా కొట్టడం, కత్తులతో ఒక మహిళ చేయి నరకడం, వంటి ఘటనలు పార్టీకి చెడ్డపేరు తెచ్చాయి. అంతే కాకుండా.. మీ హయాంలో ఇలా జరగలేదా అని మాట్లాడటమూ సరైంది కాదు.. అలా చేసినందుకే టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న సంగతి వైసీపీ నేతలు మరిచిపోకూడదు. అధికారం అందుకున్న తొలి సంవత్సరంలోనే ఇలాంటి ఇమేజ్ పార్టీకి తెచ్చిపెడితే దాని ప్రభావం మిగిలిన నాలుగేళ్లు ఉంటుందన్న సంగతిని స్థానిక నాయకులు విస్మరిస్తున్నారు. ఇలాంటి విపరీత పోకడలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: