ఆ పేరు వింటే యూత్‌లో క్రేజ్‌... పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో జోష్‌..  ప్ర‌జ‌ల‌తో ఇట్టే మ‌మేకం అయ్యే ప్ర‌జాప్ర‌తినిధి..  ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే ధీశాలి.. ఒక‌ప్పుడు ఆర్ ఎస్ ఎస్‌కు సామాన్య కార్య‌క‌ర్త గా ఉన్న ఆయ‌న నేడు ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్లు ఎదుగుతూ ఆ పార్టీ రాష్ట్ర‌శాఖ‌కు సార‌థి అయ్యారు. అయ‌న మ‌రెవ‌రో కాదు క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌..  హిందుత్వ ఎజెండాను అమ‌లు చేయ‌డంలో , అధికార టీఆర్ ఎస్‌ను దీటుగా ఎదుర్కోవ‌డంలో ముందుండ‌టంతో జాతీయ నాయ‌క‌త్వం బండి సంజ‌య్‌వైపు మొగ్గు చూపింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ‌కు అధ్య‌క్షుడిగా కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. అయితే అధినాయ‌క‌త్వం త‌నపై ఉంచిన న‌మ్మ‌కాన్ని సంజ‌య్ ఏ మేర‌కు నిల‌బెట్టుకుంట‌డు.. అధికార పార్టీని ఎలా ఎదుర్కుంటాడు అనేది వేచి చూడాల్సిందే.

టీఆర్ ఎస్‌కు గ‌ట్టిగా బ‌దులివ్వ‌డం.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండ‌టం సంజ‌య్‌కు బాగా క‌లిసి వ‌చ్చాయ‌ని అంటున్నారు. రాష్ట్రంలో బండి సంజ‌య్ నేతృత్వంలో బీజేపీ మ‌రింత బ‌లప‌డుతుంద‌ని అధిష్టానంతోపాటు పార్టీ నాయ‌కులు విశ్వ‌సిస్తున్నారు. త‌మ పార్టీకి గుండెకాయ‌లాంటి క‌రీంన‌గ‌ర్‌లో టీఆ ర్ ఎస్‌ను ఓడించిన‌ప్ప‌టి నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌, వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ లు బండి సంజ‌య్‌పై ఓ క‌న్నేసి ఉంచార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈక్ర‌మంలోనే రాష్ట్ర‌మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కూడా క‌రీంన‌గ‌ర్ కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. జిల్లానుంచి అప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్ మంత్రులుగా ఉండ‌గా, క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల క‌మలాక‌ర్‌ను కూడా కేబినెట్‌లో తీసుకోవ‌డంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. ఎంపీ బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకే జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని జిల్లాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

క‌రీంన‌గ‌ర్‌లో సాధారాణ కార్పొరేట‌ర్ గా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన బండి సంజ‌య్‌.. అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చారు. టీఆర్ ఎస్‌కు కంచుకోట‌లాటంటి క‌రీంన‌గ‌ర్‌లో ప్ర‌తీ ఎన్నికల్లో సంజ‌య్ గ‌ట్టి పోటీ ఇస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే 2019 లోక్‌స‌భ ఎన్నికల్లో క‌రీంన‌గ‌ర్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయ‌న.. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌పై 90వేల పైచిలుకు మెజార్టీతో విజ‌యం సాధించి, రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అనంత‌రం అన‌తికాలంలోనే ఆయ‌న రాష్ట్ర‌స్థాయి నేత‌గా ఎదిగారు. మొద‌టి నుంచి ఆర్ ఎస్ ఎస్ భావాలున్న ఆయ‌నకు క‌రడుగ‌ట్టిన హిందుత్వవాదిగా  పేరుంది. ఆ గుర్తింపే ఇప్పుడాయ‌న‌కు ఇంత పెద్ద బాధ్య‌త‌ను తెచ్చి పెట్టింద‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: