తిరుపతి మున్సిపాలిటి పరిధిలోని సీనియర్ నేతల్లో ఎక్కువమంది పార్టీ అధిష్టానంపై తీవ్రంగా మండిపోతున్నారు. ఎన్నికల ప్రక్రియ ముందు వరకూ సీనియర్లకు ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబునాయుడు ఇపుడు దూరంగా పెట్టేయటమే అందరినీ ఆశ్చర్యానికి గురేచేస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము కానీ తమ కుటుంబసభ్యులకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు స్వయంగా చాలామంది సీనియర్లకు హామీ ఇచ్చారు.

 

అయితే ఇపుడు ఎన్నికల ప్రక్రియ మొదలై నామినేషన్లు వేయాల్సొచ్చేటప్పటికి సీనియర్లను కాదని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కాదని కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుండటంతో చాలా మందికి మండిపోతోంది.  పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్సీ మునికృష్ణ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్, మన్నెం శ్రీనివాసులు, విజయలక్ష్మి  రెండు రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారని సమాచారం. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని కొత్త వాళ్ళని దగ్గరకు తీసుకోవటం అంటే కార్యకర్తలకు నాయకత్వం ఎటువంటి సంకేతాలు ఇస్తోందంటూ మండిపోతున్నారట.

 

నిజానికి చంద్రబాబుకు ఈ పద్దతి మొదటి నుండి ఉన్న అలవాటే. పార్టీకి పనిచేయటానికి కొందరు కావాలి. పదవులకు మాత్రం వేరే వాళ్ళని ఎంపిక చేస్తారు. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నేపధ్యంలో కూడా చంద్రబాబు వైఖరిలో మార్పు రాకపోవటంపైనే వీళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. అంటే సీనియర్ నేతల మాటలను బట్టి చూస్తే మున్సిపాలిటి ఎన్నికల్లో  టిడిపికి దెబ్బ పడటం ఖాయమనే అనిపిస్తోంది.

 

నిజానికి పార్టీ పరిస్దితి అంతంత మాత్రంగానే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. రోజు టెలికాన్ఫరెన్సు పెట్టి వేలమందితో మాట్లాడుతున్న చంద్రబాబుకు గ్రౌండ్ రియాలిటి తెలియకపోవటంతోనే సమస్యలు వస్తున్నాయి. ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పిన మాటలు వినేసి జనాల్లో పార్టీ పరిస్దితి బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు అనుకుంటున్నారు. వాస్తవాలు చెప్పేవాళ్ళని దూరంగా పెట్టేస్తారని అందరికీ తెలుసు కాబట్టే ఎవరూ వాస్తవాలు చెప్పటం లేదు. తాజాగా తిరుపతి మున్సిపాలిటిలో ఏమి జరుగుతోందన్నదే క్లాసిక్ ఎగ్జాంపుల్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: