తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సీట్ల రగడ నడుస్తున్న విషయం తెలిసిందే. ఉన్న రెండు సీట్లకు చాలామంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే అందులో ఒక సీటు మాత్రం మళ్ళీ సీనియర్ నేత కె కేశవరావు దక్కడంగా ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండో స్థానానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.  అలాగే మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్‌ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారితోపాటు దామోదర్‌రావు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  

 

అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన కవితను పెద్దల సభకు పంపితే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే వాదనతో ఆ ఆలోచన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే కవిత పేరు పక్కకు వెళ్లిపోవడంతో పొంగులేటి రాజ్యసభ సీటు కోసం కేసీఆర్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నోటిఫికేష‌న్ వ‌చ్చిన దగ్గరనుంచి కేసీఆర్‌, కేటీఆర్‌లతో టచ్‌లో ఉంటూ వస్తున్న పొంగులేటి, బుధ‌వారం కూడా అసెంబ్లీ ప్రాంగ‌ణంలో క‌నిపించారు. అసెంబ్లీలో ఉన్న కేటీఆర్‌ ఛాంబ‌ర్‌కు వెళ్ళిన పొంగులేటి ఆయనతో చాలాసేపు మాట్లాడారు. అలాగే త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ఎమ్మెల్యేల‌ను కూడా కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా పొంగులేటికి మ‌ద్ద‌తుగా నిలిచే వారిలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఉన్నారు.

 

అయితే పొంగులేటి ఈ విధంగా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తుంటే, ఆయన సొంత జిల్లా ఖమ్మంకు చెందిన ముగ్గురు టీఆర్ఎస్ నేతలు మాత్రం రాజ్యసభ సీటు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పొంగులేటికి రాజ్యసభ ఇస్తే జిల్లాలో తమ సామాజికవర్గ నేతలకు ప్రాధాన్యం తగ్గిపోతుందని, కాబట్టి ఆయనకు కాకుండా రాజ్యసభ హెటిరో ఫార్మా అధినేత పార్థ‌సారధి రెడ్డికి అవ‌కాశం ఇవ్వాలంటూ గులాబీ బాస్‌ని కోరుతున్న‌ట్టు సమాచారం. మరి చూడాలి రేపటితో రాజ్యసభకు నామినేషన్ల లాస్ట్ రోజు కాబట్టి, కేసీఆర్ ఎవరికి సీటు ఇస్తారో?  

మరింత సమాచారం తెలుసుకోండి: