కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోలింగ్‌కు ముందే దయనీయ స్థితిని ఎదుర్కొంటుందా..? ఆ పార్టీకి అభ్యర్ధులే కరువయ్యారా..? అంటే.. అవుననే సమాధానం విన్పిస్తోంది. అభ్యర్ధుల కోసం ఒకవైపు టీడీపీ నానా  తంటాలు పడుతుంటే.. మరోవైపు అధికార పార్టీ వైసీపీ వేగాన్ని పెంచింది. అభ్యర్ధుల ఎంపిక, వివాదాల పరిష్కారం వంటి విషయాల్లో వైసీపీ ముందుంది.

 

కర్నూలు జిల్లాలో 807 ఎంపిటిసి, 53 జెడ్పిటిసి స్థానాలకు, 9 మున్సిపాలిటీలు, 872 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఈ ఎన్నికల్లో బలహీనంగా కన్పిస్తోంది. అధికార పార్టీ వైసీపీ స్ధానిక సంస్థల ఎన్నికల్లో అన్ని విషయాల్లో వేగంగా దూసుకుపోతుంటే.. టీడీపీ మాత్రం అభ్యర్ధుల కోసం వెతుకలాడాల్సి వస్తోంది. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నికల్లో పోటీ పడేందుకు అభ్యర్ధులు ముందుండేవారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు అభ్యర్థుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. రెండు, మూడు నియోజకవర్గాల్లో మాత్రమే మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కిందిస్థాయి నాయకులను సన్నద్ధం చేస్తున్నారు.  

 

అటు అధికార పక్షం వైసీపీ మాత్రం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధుల ఎంపిక, వివాదాల పరిష్కారంలో ప్రతిపక్షం కన్నా ముందుంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిలు నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో చర్చించి అభ్యర్ధుల ఎంపిక దాదాపు పూర్తి చేశారు. ఇక నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్ధులకు పోటీ ఉన్నా అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. వైసీపీ అధిష్టానానికి అత్యంత జఠిలంగా ఉన్న నందికొట్కూరులోనూ ఎమ్మెల్యే ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి మధ్య వివాదాన్ని తాత్కాలికంగా పరిష్కరించారు. కోడుమూరు నియోజకవర్గంలోనూ నేతల మధ్య ఉన్న వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చారు. ఒకటి, రెండు స్థానాల్లో నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో వాటిని కూడా పరిష్కరించే పనిలో ఉన్నారు జిల్లా ఇన్‌ఛార్జ్‌లు.

 

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయ్. 2019 ఎన్నికల్లో టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. దీంతో స్థానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసినా అభ్యర్ధులకు జిల్లా పార్టీ నేతల నుంచి ఆర్ధిక సహకారం, పూర్తి స్థాయి అండ ఉంటుదన్న నమ్మకం లేదు. ఇవన్నీ ఎదుర్కొని పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం లేకపోవడం టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్ధులు ముందుకు రాకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది.

 

అసెంబ్లీ ఎన్నికల్లో చేతులేత్తేసిన టీడీపీ.. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మనుగడ కాపాడుకుంటుందా.. లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: