చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కింది. స్థానిక సమరంలో విజయ భేరి మోగించడానికి అన్ని పార్టీలు సిద్ధమయ్యాయ్. అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు వేరు.. కుప్పం వేరు అన్నట్లు పరిస్థితి తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకి మెజార్టీ తగ్గించి షాక్ ఇచ్చిన వైసీపీ.. స్థానిక సంస్థల్లో కుప్పం నియోజవర్గమే టార్గెట్‌గా యాక్షన్‌ ప్లాన్ రెడీ చేస్తోంది .

 

చిత్తూరు జిల్లాలో కుప్పంకు ప్రత్యేకత ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడొక్కచోటే ప్రతిపక్ష టీడీపీ నాయకుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సొంత నియోజకవర్గం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ అత్యధిక స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదల టీడీపీతో పాటు, అధికార వైసీపీలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే  రెండు పార్టీల నాయకులు కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీల హడావుడి మొదలైంది. 

 

నియోజకవర్గంలో కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలున్నాయి. ఈ మండలాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు జోరుగా సాగుతోంది. వైసీపీ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేశారు. అయితే టీడీపీ అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతోంది. ఇక జనసేన, బిజెపి, కాంగ్రెస్ తమ పార్టీల తరపున బరిలో దిగేవారి కోసం వెతుకుతున్నాయ్‌. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతను అధికార పార్టీలో సీఎం జగన్‌ ఎమ్మెల్యేలకు అప్పగించారు. అయితే కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎమ్మెల్యే లేరు. దీంతో అధికార పార్టీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను వ్యూహాత్మకంగా కుప్పం నియోజకవర్గంలో తిప్పుతోంది వైసీపీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్‌లో  రెడ్డెప్ప దాదాపుగా రోజుమార్చి రోజు కుప్పం నియోజకవర్గానికి రాకపోకలు సాగిస్తున్నారు. 

 

స్థానిక ఎన్నికల్లో మాజీ సీఎం సొంత నియోజకవర్గంలో బలం నిరూపించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే కుప్పంను మున్సిపాలిటీగా చేయడంతో పాటు, యాబైవేల ఎకరాలకు నీరు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నియోజకవర్గానికి హామిలిచ్చారు. దీంతో స్థానిక సంస్ధల ఎన్నకలలో వైసీపీని గెలిపించాలని కోరారు పెద్దిరెడ్డి.

 

మరోవైపు కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది టీడీపీ. శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గడం పార్టీ నేతల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసింది. అయితే, ఇక్కడ టీడీపీకి కలిసొచ్చే అంశం ఉంది. అధికార పార్టీ వైసీపీలో లేని క్రమశిక్షణ టీడీపీకి ఉంది. ఆ బలంతోనే ఎన్నికలను ఎదుర్కొవడానికి పార్టీ సన్నదమవుతోంది. అధినేత చంద్రబాబు గత నెలలో జిల్లాలో జరిపిన ప్రజా చైతన్య యాత్రలు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయ్‌. అయితే అభ్యర్ధుల ఎంపిక టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. బలమైన అభ్యర్ధుల కోసం కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పార్టీ అంతర్గత సమావేశాలు జరిగాయి. 

 

మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును దక్కించుకోవాలని టీడీపీ తాపత్రయపడుతుంటే.. ఎలాగైనా నెగ్గి చంద్రబాబు ఇలాఖాలో తమ జెండా ఎగరేయాలని వైసీపీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: