స్థానిక సంస్థల ఎన్నిక‌ల నేప‌థ్యంలో విజన్ డాక్యుమెంట్‌ను విజయవాడలో బీజేపీజనసేన పార్టీలు సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ సందర్భంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు మండిప‌డ్డారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు... అలాంటి గ్రామాల రూపురేఖలు మార్చే స్థానిక సంస్థల ఎన్నికలను బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.

 

నామినేషన్ల వేళ ఇంతటి హింసను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఎప్పుడు చూడలేదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. “2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించకుండా దాట వేస్తే... ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం, దాడులతో ఎన్నికలను ఏకపక్షం చేయాలని చూస్తోంది. యువతకు అవకాశం కల్పించాలని మేము ఒకవైపు ఆలోచిస్తుంటే... వీళ్లేమో నామినేషన్లు వేయలేని పరిస్థితి సృష్టిస్తున్నారు. దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఎలక్షన్లు ఎందుకు..? జగన్ రెడ్డి వారి అభ్యర్ధులను మాత్రమే నిలబెట్టుకొని ఏకగ్రీవం అని ప్రకటించుకోవచ్చుగా` అని ప‌వ‌న్‌ వ్యాఖ్యానించారు. నామినేషన్లకే ఇంత బీభత్సం సృష్టిస్తే... రేపు పోలింగ్ సమయంలో ఎంత హింస సృష్టిస్తారోనని ప్రజలు భయపడుతున్నారని ప‌వ‌న్ పేర్కొన్నారు. అదుపు తప్పిన ఎద్దుకు ముక్కుతాడు వేసినట్లు... వైసీపీ రౌడీయిజానికి ముక్కుతాడు వేయాల్సిన సమయం వచ్చిందని ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసి గెలిచినా అలాంటి గెలుపు ఎన్నటికీ నిలబడదని అన్నారు.

 


``పోలీసు అధికారులు, ఎలక్షన్ అధికారుల ముందే వేరే పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. కొంతమంది అధికారుల కళ్లెదుటే అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు. శేషన్ లాంటి వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉంటే ఇలా జరిగేదా..? రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు తమ బాధ్యతలు గుర్తు చేసుకోవాలి. సామాన్యులకు అన్యాయం జరగకుండా బాధ్యత తీసుకోవాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్ల సందర్భంగా వైసీపీ చేసిన దౌర్జన్యాలను కేంద్రం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం.`` అని పవ‌న్ ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: