ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీకి, మాజీ ముఖ్యమంత్రి... టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాకులు ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరుతూ ఉండటంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కు టీడీపీ నేతలను చేర్చుకునే ఉద్దేశం లేకపోయినా ఆ పార్టీ నేతలే టీడీపీలో భవిష్యత్తు ఉండదని గ్రహించి వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. 
 
స్థానిక ఎన్నికల ముందు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ మారుతూ ఉండటం వల్ల ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. మొదట ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. నిన్న జగన్ సొంత జిల్లా కడపలో కీలక నేతగా గుర్తింపు పొందిన టీడీపీ ముఖ్య నేత, పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్న రామసుబ్బారెడ్డి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 
 
ఈరోజు చీరాల టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మాత్రం పార్టీని వీడారు. ఆయన వైసీపీలో చేరడంతో చంద్రబాబు చేసేదేం లేక యడం బాలాజీని చీరాల నియోజకవర్గం ఇంఛార్జీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మూడు రోజుల్లో ముగ్గురు టీడీపీ నేతలు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. 
 
మరికొంతమంది టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు టీడీపీ కీలక నేతలతో భేటీ జరిపి పార్టీ మారుతున్నట్లు ఎవరి పేర్లు వినిపిస్తున్నావో వారితో సంప్రదింపులు జరిపి పార్టీ మారకుండా చేయాలని కొందరు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారని సమాచారం. మరి చంద్రబాబు, సీనియర్ నేతలు ఆపే ప్రయత్నాలు చేసినా పార్టీని వీడాలనుకున్న నేతలు మాత్రం నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: