క‌రోనా వైర‌స్ తెలంగాణ‌లో విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ సచివాలయంలో స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అయింది. మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ సంద‌ర్భంగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ, గాంధీ ఆసుపత్రిలో covid-19 పాజిటివ్‌తో చేరిన వ్యక్తికి పూర్తిగా నయం అయింద‌ని, డిశ్చార్జ్  చేయబోతున్నామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. తెలంగాణలో ఇప్పటివ‌ర‌కూ ఒక్క కేసు కూడా పాజిటివ్ లేదని మంత్రి ఈట‌ల తెలిపారు. కాగా, తెలంగాణ‌లో క‌రోనా బాధితుడికి చికిత్స అందించ‌డం, రోగి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ‌డం ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

 


శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్టాండి థ‌ర్మో స్క్రీన్‌లు అందించామ‌ని తెలిపిన మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విమానాశ్రయంలో ప్రతి విదేశీ ప్రయాణీకులను స్క్రీన్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. బయటి దేశం నుండి వచ్చే వారు ఖచ్చితంగా 14 రోజులు ఇంట్లోనే (ఐసోలేషను) లో ఉండాలని ఆయ‌న కోరారు. కుటుంబసభ్యులను కానీ, బయటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కలవవద్దని విజ్ఞ‌ప్తి చేశారు. ``విదేశాల నుండి వచ్చే వారికి 104 కాల్ సెంటర్ నుండి ఫోన్లు వస్తాయి, వాటికి స్పందించండి. దయచేసి నిజ‌మైన  సమాచారం ఇవ్వండి. విదేశాల నుండి వచ్చే వారి ద్వారా మాత్రమే తెలంగాణ గడ్డ మీదికి covid-19 వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి సహకరించండి. ``అని మంత్రి ఈట‌ల విజ్ఞ‌ప్తి చేశారు. 

 

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ``బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించవద్దు. కాన్ఫరెన్సులు/ సెమినార్లు  కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.`` అని పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: