స్థానిక సంస్థ ఎన్నిక‌లు, ఏపీలో రాజ‌కీయాల గురించి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీజనసేన పార్టీలు సంయుక్తంగా స్థానిక సంస్థల విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ...నేరపూరిత రాజకీయాలకు బీజేపీ, జనసేన పార్టీలు వ్యతిరేకమ‌ని స్ప‌ష్టం చేశారు. స్థానిక ఎన్నిక‌ల్లో బెదిరింపు రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌ని మండిప‌డ్డారు ``నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులు ధైర్యంగా గెలుపు కోసం పని చేయండి. మనం ఇవాళ వారి బెదిరింపులకు భయపడి ఆగిపోతే వాళ్లు గెలిచినవారు అవుతారు. దెబ్బలు తిన్నా ధైర్యంగా నిలబడి పోరాడి ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టండి. బీజేపీ, జనసేన పార్టీలు అండగా ఉంటాయి. అభ్యర్ధుల్లో ధైర్యం నింపడానికి అందరం అందుబాటులో ఉంటాం” అని ప‌వ‌న్‌ అన్నారు.




ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ``ఈ మధ్య ఢిల్లీలో కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్లు ఏపీ మరో బీహార్ రాష్ట్రంలా తయారవుతోంది అని అన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన నాయకులపై రాళ్ల దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చించివేయడం, ప్రశాంత గోదావరి జిల్లాల్లో భూసేకరణ పేరుతో భూములు లాక్కొంటామని, బైండోవర్ కేసులు పెడతామని రైతులను బెదిరించడం చూస్తుంటే నిజమే అని అనిపిస్తోంది. నామినేషన్ల వేళ ఇంతటి హింసను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఎప్పుడు చూడలేదు. ఎక్కడో అడపాదడపా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి తప్ప... 13 జిల్లాల్లో ఇప్పుడు ఏ మూలన చూసినా అరాచకాలే. ప్రశాంతమైన గోదావరి జిల్లాలకు కూడా రౌడీయిజం వచ్చేసింది.`` అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ పక్షంలా వ్యవహరిస్తున్నారని ప‌వ‌న్ మండిప‌డ్డారు.  


నియంతృత్వానికి ఫ్యాక్షనిజం తోడయితే ఇంతే జ‌రుగుతుంద‌ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ``స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాక్షనిస్టులు టెండర్ ఫారాలు లాక్కెళ్లడం, చించివేయడం మనం చూశాం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నామినేషన్ ఫారాలు లాక్కెళ్లడం, చించివేయడం చూస్తున్నాం. నా 47 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి అకృత్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు నేను చూడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అసలు ఎన్నికలు జరపకుండా నామినేషన్ పద్ధతిలో పదవులు భర్తీ చేస్తే సరిపోయేదిగా? ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే ఈ ఎన్నికల తంతు అంతా. మీ ప్రాంతంలో గెలవకపోతే మీ ఉద్యోగాలు పోతాయని మంత్రులను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి బెదిరించడం ఏంటి? వారు రెచ్చిపోయి అరాచకాలు సృష్టించడం ఏంటి? సాక్షాత్తు రిటర్నింగ్ అధికారుల సమక్షంలో కూడా నామినేషన్ పత్రాలను వైసీపీ గూండాలు చించివేశారు. ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు చెప్పుకున్నా దిక్కులేదు. ప‌రిశీల‌న‌లో కూడా ఇష్టం వచ్చినట్లు నామినేషన్లను తిరస్కరిస్తున్నారని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. పాత ఓటరు లిస్టులో పేరు ఇలా ఉందే....కొత్త ఓటర్ లిస్టులో పేరు అలా లేదే అంటూ కుంటిసాకులు చెబుతూ అధికారులు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారు.`` అంటూ మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: