తెలంగాణ లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల కోసం అధికార టీఆరెస్  పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది . అందరూ ఊహించినట్లుగానే  ఆ పార్టీ రాజ్యసభ పక్ష నేత, పార్టీ సెక్రటరీ జెనరల్ కేశవరావు మరొకసారి అవకాశం ఇవ్వాలని టీఆరెస్ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . అయితే రెండవ అభ్యర్థి స్థానం కోసం పార్టీ  నాయకత్వం,  పలువురి పేర్లను  పరిశీలించింది . ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపు  ఖాయమేనన్న ప్రచారం జరిగింది . బుధవారం అసెంబ్లీలో ఆయన కేటీఆర్ ను కూడా  కలుసుకున్నారు . దీనితో   పొంగులేటినే పార్టీ  రెండవ రాజ్యసభ  అభ్యర్థి అని అందరూ భావించారు .

 

కానీ కేసీఆర్,  అనూహ్యంగా మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు . సురేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆరెస్ లో చేరారు . సౌమ్యుడిగా పేరున్న సురేష్ రెడ్డి ని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని భావిస్తున్న తరుణం లో రాజ్యసభ అభ్యర్థిగా ఆయన పేరు ను కేసీఆర్ ఖరారు చేశారు . అసలు శ్రీనివాస్ రెడ్డి ని కాదని సురేష్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు కేసీఆర్  మొగ్గు చూపడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది . శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు టీఆరెస్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది .

 

తుమ్మల నాగేశ్వర్ రావు , జలగం ప్రసాద్ రావు , మదన్ లాల్ లను ఓడించేందుకు ప్రయత్నించడం వల్లే ఆయనకు లోక్ సభ టికెట్ ఇవ్వలేదన్న వాదనలు పార్టీ వర్గాల్లో విన్పిస్తున్నాయి  . ఇక ఇప్పుడు కూడా అదే కారణం తో రాజ్యసభ టికెట్ దక్కి ఉండకపోవచ్చునని అంటున్నారు . అయితే రాష్ట్రం లో జరుగుతున్న పలు ప్రాజెక్టు పనుల్లో  పొంగులేటి కి వందల కోట్ల రూపాయల  కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్నారని , అందుకే ఆయనకు రాజ్యసభ ఇవ్వలేదన్న వాదనలు కూడా లేకపోలేదు .   

మరింత సమాచారం తెలుసుకోండి: