తెలంగాణ కాంగ్రెస్  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ  రేవంత్ రెడ్డి దూకుడే ఆయన్ని జైలు పాలు చేసిందా?,  పార్టీ పక్షాన , ప్రజా సమస్యలపై ఆయన  గళం విప్పడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారా ??  అంటే అవుననే రేవంత్ వర్గం నుంచి  సమాధానం విన్పిస్తోంది. రేవంత్ అరెస్టు పూర్వాపరాలను ఒక్కసారి పరిశీలిస్తే ... రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి  కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమయంలోనే , రేవంత్ పట్టణ గోస పేరిట సొంతంగా కార్యక్రమాన్ని చేపట్టారు . తన నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి , ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందో  రెవెన్యూ అధికారులను ఆరా తీసే కార్యక్రమాన్ని చేపట్టారు .

 

ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు , ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది . ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలు లేకపోలేదని భావించిన  అధికార పార్టీ పెద్దలు ...  రేవంత్ పై పాత కేసులు తిరగదోడే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి  . అందులో భాగంగా రేవంత్ ఆయన సోదరుడు భూఅక్రమణకు పాల్పడ్డారని కేసు పెట్టడమే కాకుండా , ప్రత్యేకంగా కమిషన్ వేసి విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది . భూ ఆక్రమణ కేసులు ద్వారా రేవంత్ దారికి వస్తాడని భావించిన ప్రభుత్వ పెద్దలకు ఆయన తిరగబడడం ఏమాత్రం రుచించలేదు .  జన్వాడ లో ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అక్రమంగా జీవో 111 ఉల్లంఘించి ఫామ్ హౌస్ నిర్మించారని మీడియా ను తీసుకువెళ్లి చూపించిన రేవంత్ , అంతటితో ఆగకుండా  డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న అభియోగం పై పోలీసులు  కేసు నమోదు చేసి  అరెస్టు చేశారు .

 

అయితే ఆయనతో పాటు అరెస్టుయిన వారికి బెయిల్ లభించినప్పటికీ , రేవంత్ మాత్రం ఇప్పటి వరకు జైలులోనే ఉన్నారు . ఈ సమయం లో పార్టీ పక్షాన  రేవంత్ కు దన్నుగా నిలువాల్సిన సీనియర్లు మాత్రం ఆయన ఎవర్ని అడిగి ఆందోళనలు చేశారని ప్రశ్నించడం హాస్యాస్పదంగా   ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి .  

మరింత సమాచారం తెలుసుకోండి: