ఇండియన్ రైల్వేస్ ఇటీవ‌లే తీపిక‌బురు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ముంబై-అహ్మదాబాద్ మ‌ధ్య 
భారతదేశం యొక్క మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తి కానుందని తెలియ‌జేయ‌డంతో పాటుగా హైదరాబాదీలకు తీపికబురు అందించింది. భారతీయ రైల్వే ఆధ్వ‌ర్యంలో దేశంలో మొత్తం 10 బుల్లెట్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు అందులో తెలంగాణకు ఓ రైలు అవ‌కాశం ఉండ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే, తాజాగా హైద‌రాబాద్-విజ‌య‌వాడ మ‌ధ్య బుల్లెట్ రైల్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

 


రైల్వే బడ్జెట్ చర్చలో భాగంగా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర‌సంగిస్తూ... హైదరాబాద్ - విజయవాడకు బులెట్ ట్రైన్ నడపాలని డిమాండ్ చేశారు. ముంబాయి-అహ్మదాబాద్ తరహాలో హైద‌రాబాద్ నుంచి విజయవాడకు బుల్లెట్ ట్రైన్ లేదా హైస్పీడ్ ట్రైన్ కానీ నడపాలని  నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన పార్లమెంట్లో రైల్వే బడ్జెట్‌పై చర్చలో ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ రైల్వే లైన్, బులెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తే లాభ దాయకంగా ఉంటుందని అన్నారు. రైల్వే లైన్ కోసం జాతీయ రహదారి వెంట భూమి కూడా ఉందని వివరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ కు జాతీయ రహదారి నుంచి కొత్త రైల్ మార్గం వేయాలని ఉత్త‌మ్ సూచించారు. 

 


కేంద్రం కొత్తగా ఏర్పాటు చేయనున్న రైల్వే ప్రాజెక్టులలో హైదరాబాద్ కు అవకాశం ఇవ్వాలని న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కోరారు. జగ్గయ్యపేట నుంచి మిర్యాలగూడ వరకు గూడ్స్ రైల్ నడుస్తుందని దాన్ని ప్యాసింజర్ రైలుగా మార్చాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మెల్లచేరువు, మిర్యాలగూడకు షటిల్ రైల్ నడపాలని ఉత్త‌మ్ ప్ర‌తిపాదించారు. ఆంద్రప్రదేశ్ విభజన బిల్లులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి హామీ ఇచ్చారని తెలిపిన ఉత్త‌మ్‌కుమార్ ఆ హామీ ఇచ్చి 6 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం సమాధానం చెప్పాలని ఉత్త‌మ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: