ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు భారీ నజరానా ప్రకటించారు. గ్రామ సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయితే ఆ గ్రామానికి ప్రభుత్వం లక్షల రూపాయల నగదు ఇవ్వనుంది. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గ్రామాలను నాలుగు రకాలుగా విభజించింది. 
 
పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ఇచ్చే నజరానా వివరాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీలో 13,368 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో సగం సర్పంచ్ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. దాదాపు సగం స్థానాలలో మహిళలే సర్పంచ్ లుగా ఎన్నిక కానున్నారు. ప్రభుత్వం ఏకగ్రీవమయ్యే 2 వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. 
 
2 వేల నుండి 5 వేల లోపు ఉన్న గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, 5 వేల నుండి 10 వేల లోపు ఉన్న గ్రామ పంచాయతీలకు 15 లక్షలు, 10 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ప్రభుత్వం ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు భారీ నజరానా ప్రకటించటంతో పలు గ్రామాలలో పంచాయతీలను ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. ప్రభుత్వం కేవలం పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ప్రోత్సాహకాలను అందించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రామాల అభివృద్ధి కోసం వివిధ నిధులు అందుతున్నాయి. ప్రభుత్వం గ్రామాలలో పన్నుల రూపంలో పంచాయతీలు వసూలు చేసుకునే మొత్తానికి సమానంగా నిధులను అందజేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: