కర్నూలు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కెఇ సోదరులు పెద్ద దెబ్బ కొట్టినట్లే. మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేయటం చంద్రబాబునాయుడుకు షాక్ కొట్టేదనటంలో సందేహం లేదు.  దశాబ్దాలుగా కెఇ సోదరులు జిల్లాలో టిడిపికి బాగా అండగా ఉన్నారనటంలో సందేహం లేదు. టిడిపి అధికారంలో ఉన్నపుడు కెఇ కృష్ణమూర్తి రెవిన్యుమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కెఇ ప్రభాకర్ ఎంఎల్సీగా కూడా పనిచేశారు.

 

సరే కారణాలు ఏవైనా మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో పాటు  కెఇ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు కూడా ఓడిపోయాడు. పార్టీ ఓడిపోయిన తర్వాత కెఇ దాదాపుగా రాజకీయాలకు దూరమైపోయినట్లే అనుకోవాలి. దానికి తోడు వయస్సైపోవటం, అనారోగ్యం కారణాలతో కూడా కృష్ణమూర్తి ఎక్కడా కనబడటం లేదు. ఎప్పుడైతే అగ్రజుడు పార్టీకి దూరంగా ఉంటున్నారో ప్రభాకర్ కూడా దూరంగా ఉంటున్నాడు.

 

అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తన మద్దతుదారులకు టిక్కెట్లివ్వలేదన్న సాకును చూపించి ఏకంగా పార్టీకే రాజీనామా చేసేయటం సంచలనంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకపోవటం, టిడిపికి భవిష్యత్తు లేదన్న అనుమానంతోనే చాలామంది నేతలు పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇందులో భాగంగానే కెఇ ప్రభాకర్ కూడా రాజీనామా చేసినట్లే అనుకోవాలి.

 

మరి రాజీనామా చేసిన తర్వాత ఎందులో చేరుతారు ? అనుమానం అవసరం లేదు. ఎందుకంటే నదులన్నీ సముద్రంలోనే కలిసినట్లు ఇపుడు రాజీనామా చేసిన నేతలంతా వైసిపిలో చేరినట్లే ఈయన కూడా వైసిపిలోనే చేరుతానటంలో సందేహం లేదు. కాకపోతే ఇప్పటికింకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదంతే. ప్రభాకర్ వైసిపిలో చేరితే కృష్ణమూర్తి కూడా టిడిపికి దూరమైనట్లే.  కెఇ సోదరులకు జిల్లాలోని బిసి సామాజికవర్గంలో కాస్త పట్టుందనే చెప్పాలి. కాబట్టి ఒకవేళ కెఇ సోదరులు గనుక వైసిపిలో చేరితే వాళ్ళ క్యాడరంతా వైసిపిలోకి మారిపోతుంది. అప్పుడు టిడిపికి ఇబ్బందులు తప్పవు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: