కొన్నేళ్లుగా ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఆ సమయంలో వార్తల్లో ఉన్న విషయంపై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు పుట్టుకొచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో ఓ సైంటిస్టు, ఓ డాక్టర్‌, ఓ లాయర్, ఓ పర్యావరణ వేత్త, ఓ హక్కుల కార్యకర్త...సందర్భాన్ని బట్టి నిద్రలేస్తున్నాడు. సమాజానికి తమ బుర్రలో ఉన్న చెత్తంతా పంచుతూ మరింత గందరగోళం చేసే సందర్భాలు పెరుగుతున్నాయి. 

 

ఓ విపత్తో, ప్రమాదమో జరిగిందంటే చాలు...ఎక్కడలేని పరిజ్ఙానం నిద్రలేస్తుంది. వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో తమ విజ్ఞాన సంపదను ప్రపంచానికి పంచేవాళ్లు ఎక్కువవుతున్నారు. విషయ పరిజ్ఙానంతో ప్రజల్లో ఎవేర్ నెస్ కోసం రాసే ఎక్స్ పర్ట్ లు అన్ని సందర్బాల్లో ఉంటారు.. వాళ్లు రాయటం, ప్రచారం చేయటం కచ్చితంగా అవసరం కానీ,... తమకు సంబంధం లేని, ఏబీసీడీలు కూడా తెలియని అంశాలపై ధారాళంగా రాసేస్తుంటారు చాలామంది. ఇప్పుడు కరోనా సందర్భంలో కూడా ప్రపంచమంతా ఇదే  ట్రెండ్‌ కనిపిస్తోంది.

 

కరోనా మహమ్మారిలా మారిందని, ఇది ఏ ఒక్క దేశానికో కాదు.. ప్రపంచానికే విపత్తని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది. అయితే, దీంతో ప్రపంచ దేశాలు, ఉమ్మడిగా, విడివిడిగా తీసుకోవలసిన చర్యలు అనేకం అవసరమౌతాయి. అవన్నీ ఆయా ప్రభుత్వాలనుండి ప్రజలకు అధికారికంగా మీడియా ద్వారా వివిధ ప్రకటనల ద్వారా తెలుస్తుంటాయి. కానీ, ఈ లోపే... కరోనా చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు, జాతి, గోత్రం వివరాలతో సహా,... అసలు వైరస్ ల పై సమగ్ర సమాచారంతో ఫేస్ బుక్, వాట్సాప్ లు నిండిపోయాయి. ఇవన్నీ సాధారణ ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలకు కారణమౌతున్నాయి.

 

ఇప్పటికే మోడర్న్ లైఫ్ లో స్ట్రెస్ పాళ్లు అమాంతంగా పెరిగాయి. పగటిపూట సాధారణ వ్యక్తి స్మార్ట్ ఫోన్ ను 2,500సార్లు చూస్తుంటాడని ఓ అంచనా.. ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చెక్ చేయటంతో మొదలై, రాత్రి కూడా ఫోన్ స్క్రీన్‌ చూడటం తోనే రోజు ముగుస్తుంది. ఇప్పుడు 45శాతం ప్రపంచ జనాభా స్మార్ట్ ఫోన్ వాడుతోంది. ఇవన్నీ కాకుండా, 24గంటల న్యూస్ చానళ్లు, పేపర్లు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కలిసి పాండమిక్ గా మారిన వైరస్ ని ఇన్ఫోడెమిక్ గా కూడా మారుస్తున్నాయి. 

 

కరోనా తగ్గాలంటే ఆవు మూత్రం తాగమని ఒకరు చెప్తారు.. సాక్షాత్తూ ఎమ్మెల్యేలు మంత్రులే దీనిపై ప్రకటనలు గుప్పిస్తారు. భారత్ లో వేడి ఎక్కువ కరోనా  లాంటి వైరస్ లు రావని మరొక పోస్టు చెప్తుంది. భారతీయులు తినే ఆహారంలోనే ఈ వైరస్ లు తట్టుకునే శక్తి ఉందంటుంది మరో పోస్ట్.. కరోనా వైరస్ చైనా తయారు చేసిన జీవాయుధం... భారత్ పై ప్రయోగించటానికే తయారు చేసిందని ఓ కథనం భయపెడుతుంది..ఇక చైనా అబద్దాలు చెప్తోంది... మృతుల సంఖ్య వేలు లక్షలు దాటుతోందని మరో వాట్సాప్ పోస్ట్ ధీమాగా చెప్తుంది.. ఇవన్నీ కాదు.. కరోనా తగ్గాలంటే పొద్దుటే రెండు వెల్లులి రెబ్బలు తినమని ఒకరు.. లేదు లేదు... పీకల్దాదా మందేస్తే కరోనా అంతు చూడొచ్చని మరో వాట్సాప్ విద్యార్థి సెలవిస్తాడు. ఇలా వాట్సాప్ యూనివర్సిటీ పరిజ్ఞానమంతా  దేశంలో అన్ని స్మార్ట్ ఫోన్ లలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇక ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిందని, ఆయుష్ విభాగం చెప్పిందని, హోమియో, ఆయుర్వేదం మందుల పేరుతో సవాలక్ష పోస్టులు 24 గంటలు ఇన్బాక్సుల్లో వచ్చి చేరుతున్నాయి. 

 

అసలు సమస్యకంటే, ఈ కొసరు పోస్టులు కలిగించే భయాందోళనలు, స్ట్రెస్ చాలా ఎక్కువగా మారుతోంది. కరోనా వైరస్ ఎంత అల్లకల్లోలం సృష్టిస్తోందో... అంతకంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ సమాచారం గందరగోళం క్రియేట్ చేస్తోంది. వీటిని గుడ్డిగా అనుసరించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. మద్యం తాగితే కరోనా తగ్గుతుందని సాగిన ప్రచారాలు నమ్మి ఇరాన్ లో 16మంది చనిపోయారు. 

 

సోషల్ మీడియా అడ్డూ అదుపు లేకుండా అరచేతిలో చేరి మెదడులో సమాచారాన్ని నింపేస్తోంది. ఇందులో పనికొచ్చేది కొంత ఉండొచ్చు.. కానీ, స్ట్రెస్ పెంచే అనవసర పరిజ్ఞానమే ఎక్కువ అని అనేక సందర్భాల్లో రుజువయింది. నిజానికి 2003లో సార్స్ వ్యాపించినపుడు సోషల్ మీడియా ఈ స్థాయిలో లేదు. ప్రజల్లో భయాందోళనలు కూడా తక్కువగానే ఉన్నాయి. వైద్య పరిజ్ఞానంతో, పరిశోధనలతో అదుపులోకి తెచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన జికా, ఎబోలా, మెర్స్,  స్వైన్ ఫ్లూ వైరస్ లు వ్యాపించినపుడు క్రమంగా సోషల్ మీడియా స్వరం పెరుగుతూ సమస్యని మరింత పెంచిందనే వాదనలున్నాయి. ఇప్పుడు కరోనా సందర్భంలో కూడా ఇన్ఫోడెమిక్ గా మారి భయాందోళనలను పెంచుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పుడు వార్తలు అవగాహనను దారి తప్పిస్తాయి. నిజాలైనప్పటికీ అన్ని విషయాలు సాధారణ ప్రజానీకం తెలుకోవలసిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: