భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ నేత. అదీ ఆయనకు కిరీటం. ఈ రెండూ ఎప్పటికీ కుదిరేవి కావు. కానీ ఏపీలో విభజన తరువాత బీజేపీలో పెరిగిన ఆశలు ఆ విధంగా  చేశాయనుకోవాలి. కన్నా స్వతహాగా కాంగ్రెస్ రక్తం నిండా ఉన్న మనిషి. ఆయన మాటలూ, చేతలూ, పోకడలూ అన్నీ అలాగే ఉంటాయి.

 

ఇక కన్నా వైసీపీలో చేరిపోదామని ముహూర్తం పెట్టుకుని మరీ అంతా సిధ్ధం  చేసుకుంటున్న వేళ ఆయన్ని తీసుకువచ్చి బీజేపీ ప్రెసిడెంట్ కిరీటం నెత్తిన పెట్టారు. కన్నాకు ఆ పదవి వల్ల ఎంతవరకూ లాభం వచ్చిందో తెలియదు కానీ కన్నా వల్ల పార్టీకి ఇసుమంత కూడా ప్రయోజనం సమకూరలేదన్నది కమలనాధుల మాట.

 

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్నా నేత్రుత్వంలో బీజేపీ ఉన్న నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు పోగొట్టుకుంది. అంతే కాదు, ఏకంగా నోటా కంటే దారుణంగా ఓట్లు తెచ్చుకుంది.  కన్నా వెనకాల కాపుల బలం ఉందని, దెబ్బకు బీజేపీకి ఆ ఓటు బ్యాంక్ అంతా తరలివస్తుందని కలలు కన్న కాషాయదళానికి కన్నా అలా చుక్కలు చూపించారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణాలో యువ నాయకుడు బండి సంజయ్ కి బీజేపీ పగ్గాలు అందించింది. ఏపీలో కూడా అదే రకమైన ఆపరేషన్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఏపీ బీజేపీకి ఆరెస్సెస్ బ్రాక్ గ్రౌండ్ ఉన్న ఫక్త్ బీజేపీ మనిషి అయిన పీవీఎన్ మాధవ్ కొత్త  ప్రెసిడెంట్ గా రాబోతున్నారని టాక్. 

 

లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి అవడంతోనే కన్నా కుర్చీ కదిలిపోతుందని ఢిల్లీ టాక్. కన్నా నోటి దురుసుతనంతో అదే పనిగా జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు, విమర్శల వల్ల బీజేపీకి లాభం లేకపోగా టీడీపీకే మేలు జరుగుతుందని ఆ పార్టీ ఏపీ నాయకులు కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసారట. ఇక కన్నా పార్టీలో కూడా  ఎవరినీ కలుపుకుని పోవడంలేదని కూడా చెప్పారట.

 

మరో వైపు కన్నా నాయకత్వంలో పాటీకి దశ, దిశ లేదని కూడా చెప్పేశారట. అదే మాధవ్ అయితే బీజేపీలో మంచి మాటకారిగానే కాదు, ఎక్కడ ఏమి మాట్లాడాలో విషయంతో సహా వివరిస్తారని, అగ్రెస్సివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో బీజేపీని నడిపించే సత్తా యువకుడి అయిన మాధవ్ కి తెలుసు అని చెబుతున్నారట. దాంతో కన్నా కుర్చీ ఖాళీ కాబోతోంది. జగన్ని అదే పనిగా  నిందించి పదవిని కాపాడుకుందామని కన్నా అనుకుంటే దానికి భిన్నంగా ఆయన సీటు కదిలిపోవడం అతి పెద్ద షాక్ గానే చూడాలి మరి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: