ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న గుడివాడని తన కంచుకోటగా మార్చుకున్న మంత్రి కొడాలి నాని స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకెళుతున్నారు. గుడివాడలో క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పైగా సరైన నాయకత్వం లేక టీడీపీ కేడర్ ఎక్కడికక్కడే చేతులెత్తేస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాని మీద పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే.

 

అయితే అవినాష్ వెళ్లిపోవడంతో గుడివాడలో టీడీపీని నడిపించే నాయకుడు కరువైపోయాడు. ఈ క్రమంలోనే చంద్రబాబు 2014 ఎన్నికల్లో కొడాలి మీద పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావుని స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇక అయిష్టంగానే పదవి తీసుకున్న రావి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించడం లేదు. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం మండలం స్థాయిలో వైసీపీకి పోటీగా అభ్యర్ధులని దించారు.

 

గుడివాడలో కొడాలి నాని తిరుగులేని శక్తిగా ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ, వైసీపీ విజయాన్ని ఆపే పరిస్థితిలో లేదు. నియోజకవర్గంలో టీడీపీ వీక్‌గా ఉండటంతో ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది. గుడివాడ మున్సిపాలిటీ ఎన్నిక ఎలాగో వాయిదా పడింది కాబట్టి...నాని ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సిలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఉన్న మొత్తం స్థానాలని వైసీపీ ఖాతాలో పడేలా చేయడానికి కష్టపడుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో వన్‌సైడ్ విక్టరీ సాధించడానికి సిద్ధమయ్యారు.

 

ఈ మూడు జెడ్‌పి‌టి‌సి స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. మామూలుగా అయితే గుడ్లవల్లేరు టీడీపీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో ఈ మండలం కూడా వైసీపీకి ఆధిక్యం ఇచ్చింది. దీంతో ఈసారి గుడ్లవల్లేరు జెడ్‌పి‌టి‌సి స్థానంలో వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే ఎం‌పి‌టి‌సి స్థానాల్లో దాదాపు 80 శాతంపైనే వైసీపీ విక్టరీ సాధించేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: