హైద‌రాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేయడంలో ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రోరైలు దాదాపు విజయవంతమైన నేప‌థ్యంలో...మరో ఎలివేటెడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. భారతీయ నగరాలతోపాటు ప్రపంచ నగరాల్లో ట్రామ్‌వే సిస్టం రోడ్డు మీద విజయవంతమవుతుండగా దానికి మించిన అన్న‌ట్లుగా.. హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ వయాడక్ట్‌ మీద నిర్మించి ట్రామ్‌వే సేవ‌లు అందుబాటులోకి తేనున్న‌ట్లు ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. 

 

 


బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం(బీఆర్‌టీఎస్‌)తో పోల్చితే ట్రామ్‌వే మెరుగైన ప్రయాణ సౌకర్యంగా ఉండడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుండడంతో నగరంలో ఇప్పటికే ప్రతిపాదించిన బీఆర్‌టీఎస్‌ స్థానంలో ఎలివేటెడ్‌ ట్రామ్‌వే నిర్మించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్జలకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ ట్రామ్​ వే రూట్లు ఉండనున్నట్లు సమాచారం. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి ప్రారంభమయ్యే ట్రామ్‌వే 18 కిలోమీటర్ల పొడవుతో నిర్మించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. జేఎన్‌టీయూ నుంచి ఫోరమ్‌మాల్‌ మీదుగా హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ను కలుపుకుని, హెచ్‌ఐసీసీ ప్రాంగణాన్ని కలుపుకుంటూ శిల్పారామం మీదుగా హైటెక్‌సిటీ సమీపం నుంచి, ఐటీ కంపెనీల ఐటీ కారిడార్‌ను కలుపుకుంటూ మెట్రోకారిడార్‌ 3కు సంబంధించి మైండ్‌స్పేస్‌ మీదుగా గచ్చిబౌలినీ కలుపుకుంటూ నార్సింగి వద్ద ఉండే మెట్రోఎయిర్‌పోర్టు స్టేషన్‌కు అనుసంధానం అవుతుందని తెలుస్తోంది. 

 

ట్రామ్​వేను ఎంపిక చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. చూడటానికి మొత్తం మెట్రోరైలు ప్రాజెక్టు మాదిరిగా కనబడినా ప్రయాణం విషయంలో మెట్రో కంటే తక్కువ సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉన్న ఈ ట్రామ్‌వే నిర్మించడానికి తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యం కూడా దీనిలో ఉంటుందని సమాచారం.  ప్రభుత్వ సంస్థలైన హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, హెఎంఆర్‌ఎల్‌, హెఏఎంఎల్‌ ఇందులో భాగస్వామ్యం కలిగి ఉంటాయని తెలుస్తోంది. కాగా, త్వరలో ఈ విషయాలను అదికారికంగా ప్రకటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: