అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే. చైనా తర్వాత కరోనా తీవ్రత ఎక్కువగా దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, అమెరికా దేశాలలో ఉంది. వైరస్ విజృంభిస్తూ ఉండటంతో అక్కడి ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా ఇతర సేవల ఉద్యోగులు ఇంటినుండే పని చేయాలని ఆదేశించింది. 
 
ఫేస్ బుక్, ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర సంస్థలు ఉద్యోగులు ఇంటినుండే పని చేయాలని కోరాయి. అమెరికాలో వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇంటినుండే పని చేస్తూ ఉండటంతో రోడ్లపై జన సంచారం తగ్గిపోతోంది. అత్యవసర సర్వీసులకు హాజరయ్యే ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వహిస్తున్నారు. అమెరికా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో వేలాది మంది మన దేశ విద్యార్థులు భారత్ కు ప్రయాణమయ్యారు. 
 
న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో విమాన చార్జీలు తక్కువగా ఉండటం వల్లే విద్యార్థులు భారత్ కు వెళుతున్నారని కథనం ప్రచురించింది. అమెరికాతో పోలిస్తే భారత్ లో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులతో పాటు ఉద్యోగులు భారత్ కు చేరుకుంటున్నారని సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించారు. దేశంలో కరోనాను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఎమర్జెన్సీ విధించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పని చేయనుందని ట్రంప్ పేర్కొన్నారు.  నెలరోజుల పాటు యూరప్ నుంచి అమెరికాకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశారు. బ్రిటన్ కు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని తెలిపారు. అమెరికాలో కరోనా వల్ల ఇప్పటివరకూ 30 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: