మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల తెలుగుదేశంపార్టీ నేతలే చేతులెత్తేశారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే ఇదే వాస్తవం అనిపిస్తోంది. ఒకవైపు తామే నామినేషన్లు వేయటం లేదని సీనియర్ నేతలు చెబుతుంటే ఇంకోవైపేమో తమ నేతలను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబునాయుడు నానా యాగీ చేస్తున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే అచ్చంగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నట్లుగానే హై కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 

కర్నూలులో డోన్ మున్సిపాలిటి విషయమై సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ డోన్ మున్సిపాలిటిలో తాము పోటి చేయటం లేదని స్పష్టంగా ప్రకటించారు. బిసిలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా తాము ఎన్నికను బహిష్కరించినట్లు ఆయనంతట ఆయనే చెప్పారు. ఈ నేపధ్యంలోనే డోన్ మున్సిపాలిటిని తాము ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డికి కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించటం గమనార్హం. వాస్తవం ఇదైతే ఇక టిడిపి నేతల నామినేషన్లను వైసిపి అడ్డుకుంటోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

 

అదేవిధంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టిడిపిలోనే అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్ధాయిలో పెరిగిపోయాయి.  దాంతో 50 డివిజన్లలోని టిక్కెట్లు తమ వర్గానికి కావాలంటూ తమ వర్గానికే కావాలని పట్టుదలకు వెళ్ళాయి. మొత్తానికి వర్గాల మధ్య కుమ్ములాటలతో మొత్తం వ్యవహారాన్ని కంపు చేసుకున్నాయి. దీనికి ముందే మున్సిపల్ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని, ఎన్నికలకు తమ వర్గం దూరమని స్వయంగా జేసి దివాకర్ రెడ్డి ప్రకటన పార్టీలో సంచలనమైంది. మరి చంద్రబాబు మాత్రం తమ నేతలను నామినేషన్లు వేయనీయకుండా టిడిపి అడ్డుకుంటోందని ఆరోపించటమే విచిత్రం.

 

విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా టిడిపి సక్రమంగా నామినేషన్లు వేయలేకపోయింది. చాలా మున్సిపాలిటిలు, కార్పొరేషన్లలో నామినేషన్లకు టిడిపి నేతలే దూరంగా ఉన్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల గొడవలు జరిగిన మాటా వాస్తవమే. అయితే నామినేషన్లు వేసిన, వేయలేక చేతులెత్తేసిన మున్సిపాలిటిలతో పోల్చితే గొడవలు జరిగింది మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. గట్టి పోటి ఇవ్వలేక చేతులెత్తేసిన విషయాన్ని దాచిపెట్టి వైసిపి నేతలే తమను అడ్డుకుంటున్నామని చంద్రబాబు పదే పదే చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: