పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఎన్నికల సంఘం ఈ పార్టీని డిసెంబర్ 11 2014న ఆమోదించింది. పవన్ పార్టీని ఏర్పాటు చేసి నేటికి ఆరు సంవత్సరాలు అవుతోంది. ఈ ఆరు సంవత్సరాలలో జనసేన పార్టీ సాధించిన దాని కంటే ఆ పార్టీ వైఫల్యాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. నిజానికి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భావించినా స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిబంధనల వల్ల బహిరంగ సభలకు బదులు పార్టీ ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 
 
జనసేన 2014లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ ఒక రకంగా కారణమని ప్రజల నుండి గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేన ఏపీలో చిత్తుచిత్తుగా ఓడింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోయాడు. జనసేన పార్టీ ఏపీలో బలపడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 
 
జనసేన పార్టీకి ప్రధాన లోపం పార్టీ నిర్మాణం... నేటికీ కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ గురించి ప్రజలకు పెద్దగా తెలియదంటే ఏపీలో పార్టీ పరిస్థితిమేమిటో సులువుగా అర్థమవుతుంది. పవన్ జనసేనను గ్రామ స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికీ జనసేనకు చాలా ప్రాంతాలలో కార్యకర్తలు, నాయకులు లేరు. ఎన్నికల ముందు పేరున్న నాయకులు కొందరు పార్టీలో చేరినా ఫలితాల అనంతరం పార్టీని వీడారు. 
 
ఏపీలో టీడీపీకి జనసేనకు మధ్య అంతర్గత ఒప్పందo ఉందని చాలామంది ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. ఈ రెండు పార్టీలను వేరువేరుగా చూసే వారు కూడా చాలా తక్కువ. పవన్ టీడీపీని ఎప్పుడూ విమర్శించకపోవడం జనసేనకు మైనస్ గా మారింది. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటాడని ఆశిస్తే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో పవన్ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల తరువాత పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకొని స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికలలోపు జనసేన ఏపీలో బలపడుతుందా...? అనే ప్రశ్నకు ఏపీలో జనసేన బలపడటం కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: