ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వారికి, తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఎమ్మెల్యే ఫోన్ స్విఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం నుండి పార్టీ కార్యకర్తలకు, నేతలకు, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందుబాటులోకి రావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
పూర్తి వివరాలలోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం  నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గత కొన్ని రోజుల నుండి పార్టీలో తన మాట చెల్లకపోవటంతో తీవ్ర అసహనంతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పి గన్నవరంలో తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదని... ఇతర నేతలు తన నియోజకవర్గం టికెట్ల కేటాయింపులో జోక్యం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 
 
వైసీపీ గెలుపు కోసం ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్న వారికి జడ్పీటీసీ, ఎంపీసీ టికెట్ల కేటాయింపులో అన్యాయం చేశారని పార్టీ నేతల దగ్గర చెప్పినట్లు సమాచారం. అధిష్టానం దగ్గర టికెట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసినా వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
2014 ఎన్నికల్లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొండేటి చిట్టిబాబు టీడీపీ అభ్యర్థి పులపర్తి నారాయణమూర్తి చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. 2019లో వైసీపీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఫలితాల అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మీడియాకు కొంత దూరంగా ఉండే కొండేటి చిట్టిబాబు అధిష్టానంపై అసంతృప్తితో అజ్ఞాతంలోకి వెళ్లి వార్తల్లో నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: