కర్నూలులో ఎన్నికలకు ముందే అధిక శాతం ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమవుతున్నాయి. జిల్లాలో జెడ్పీటీసీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కర్నూలులో చాలా చోట్ల ఎన్నికలకు ముందే మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇంఛార్జీలు బాధ్యతలు తీసుకోకుండా చేతులెత్తేస్తున్నారు. కొన్ని చోట్ల టీడీపీ నేతల అండ లేకపోవడంతో అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటూ ఉండటం గమనార్హం. 
 
2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ఎంపీ , ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ పోటీ చేసి ఓడిపోయింది. టీడీపీ నాయకత్వమే జిల్లాలో పార్టీ తపున పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని... పోటీ చేస్తామంటే బీ - ఫారం ఇస్తామని అభ్యర్థులకు చెబుతూ ఉండటం గమనార్హం. నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారానికి రావాలని, ఆర్థిక సహాయం చేయాలని కోరగా ఇంఛార్జీలు చేతులెత్తేశారని సమాచారం. టీడీపీ నేతల నుండే ఎటువంటి సహాయసహకారాలు లేకపోవడంతో తాము పోటీ చేసినా ప్రయోజనం లేదని మరికొంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. 
 
డోన్ నియోజకవర్గంలో 54 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 19 స్థానాలు ఏకగ్రీవం కావడానికి మార్గం సుగమం అయింది. ఇక్కడ 247 మంది నామినేషన్ దాఖలు చేశారు. మొదట పోటీ తీవ్ర స్థాయిలో ఉండవచ్చని వార్తలు వినిపించినా అభ్యర్థులు నామినేషన్లను వెనక్కు తీసుకుంటూ ఉండటంతో ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఉన్నాయి. కర్నూలులో గత 20 ఏళ్లలో టీడీపీ ఎప్పుడూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 
 
జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 2004లో 3, 2009లో 4, 2014లో 3 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఒక్క స్థానంలో గెలవలేకపోయిన టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. జగన్ రాష్టంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కర్నూలు అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో టీడీపీ పెద్దగా ప్రభావం చూపలేదని ఆ పార్టీ నాయకులు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: