ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా దెబ్బ‌తో ఎవ‌రికి వాళ్లు బెంబేలెత్తుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల‌కు కూడా క‌రోనా పాకేసింది. ఏపీలో నెల్లూరు జిల్లాలో తొలి క‌రోనా బాధితుడిని గుర్తించారు. అస‌లు ఈ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏమో గాని దీనిపై మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ జ‌రుగుతోన్న ప్ర‌చారం మాత్రం మామూలుగా లేదు. ఎవ‌రికి వారు ఇష్టం వ‌చ్చిన‌ట్టు న్యూస్ ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో వాస్త‌వాల‌తో పాటు ఫేక్‌న్యూస్‌లు కూడా చాలా ఎక్కువ గానే ఉన్నాయి.

 

ఈ క్ర‌మంలోనే ఏపీలో ఇప్పుడు క‌రోనా అంటే అంద‌రూ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వ్వ‌డంతో పాటు ఫేక్ వార్త‌లు సోష‌ల్ మీడియాలో ఎక్కువ ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు నెల్లూరు న‌గ‌రంలో ఓ వ్య‌క్తికి క‌రోనా సోక‌డంతో ఈ చుట్టు ప‌క్క‌ల వాళ్లంద‌రు ఇళ్ల‌కు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఫేక్ వార్త‌ల‌పై క‌ర్నూలు జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన‌ట్టు అన‌వ‌స‌రంగా వార్త‌లు ప్ర‌చారం చేస్తూ... ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  హెచ్చరించారు.

 

ఇక క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం రెండు టాస్క్ ఫోర్స్ బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని... జిల్లా వ్యాప్తంగా ఎక్క‌డైనా క‌రోనా అనుమానితులుంటే సంబంధిత లోకల్ ఎస్సైలకు సమాచారం అందిన వెంటనే ఈ టాస్క్ ఫోర్సు పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత గుర్తింపు పొందిన హాస్పిటల్స్ లో చేర్చుతారన్నారు. ఈ టాస్క్ ఫోర్సు పోలీసులు డీఎంహెచ్ వో సంర‌క్ష‌ణ‌లో ప‌ని చేస్తార‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఇక జిల్లాలో క‌రోనా అనుమానితులు, బాధితుల కోసం జిల్లా సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక ఐషోలేషన్ వార్డు ఏర్పాటు చేసి సేవలందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో ఎవ్వ‌రూ లేనిపోని వ‌దంతులు పుట్టించ‌వ‌ద్ద‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: