ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూసుకెళుతుంది. ఎన్నికలు జరగకముందే చాలా నియోజకవర్గాల్లో ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో ఏకగ్రీవం చేసుకుని దుమ్ములేపింది. ప్రతిపక్ష టీడీపీ చాలాచోట్ల చేతులెత్తేయడంతో, వైసీపీకి ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో అత్యధిక స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో కూడా మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి.

 

మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎం‌పి‌టి‌సి స్థానాలు ఉంటే, 68 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులే నామినేషన్ వేశారు. దీంతో ఆ 68 స్థానాలు వైసీపీ ఖాతాలో పడిపోయాయి. అలాగే ఐదు జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో కూడా కేవలం వైసీపీ అభ్యర్ధులే నామినేషన్ వేయడంతో, అవి కూడా వైసీపీకే దక్కాయి. అలాగే మాచర్ల మున్సిపాలిటీ కూడా వైసీపీనే సొంతం చేసుకుంది. ఇక్కడ 31 వార్డులు ఉంటే 26 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్ వేశారు.

 

అయితే గుంటూరు జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీ మాదిరిగానే మిగతా మున్సిపాలిటీల్లో కూడా వైసీపీ ‌వన్‌సైడ్‌గా విజయం సాధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో కీలకంగా ఉన్న గుంటూరు కార్పొరేషన్‌లో టీడీపీతో టఫ్ ఫైట్ ఎదురైన, చివరికి విజయం మాత్రం వైసీపీకే దక్కుతుందని తెలుస్తోంది.  అలాగే చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయని అంటున్నారు.

 

అయితే రేపల్లె, తెనాలిలలో టీడీపీతో గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది. రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. దీంతో వైసీపీ గెలుపు అంత సులువు కాదు. అదే సమయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణది కూడా అదే నియోజకవర్గం కాబట్టి, రేపల్లెలో వైసీపీకి గెలిచే అవకాశాలున్నాయి. ఇక ఇటు తెనాలిలో కూడా టీడీపీ బలంగా ఉంది. దీంతో తెనాలిలో వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కాగా, బాపట్ల, నరసారావుపేట, మంగళగిరి, పొన్నూరు, తాడేపల్లి, గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: