సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధి కోసమని చెప్పి మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి అమరావతి ప్రాంతంలోని రైతులు, ప్రజలు ఆందోళనలు, దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల నుంచి వారి నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక ప్రతిపక్ష టీడీపీ కూడా మూడు రాజధానులు వద్దు అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ రాజీనామా చేసి, మళ్ళీ గెలిచి మూడు రాజధానుల నిర్ణయం అమలు చేసుకోవాలని చంద్రబాబు సవాళ్ళు విసిరారు.

 

అయితే మూడు రాజధానుల నిర్ణయం అమలు చేయాలా? లేదా? అనేది స్థానిక సంస్థల ఎన్నికలు తేల్చేయనున్నాయి. కాకపోతే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మూడు రాజధానులు కోరుకోవడం వల్ల, వారు వైసీపీకే ఎక్కువ స్థానాలు కట్టబెట్టడం ఖాయం.  కానీ అమరావతికు అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలిస్తే, అమరావతి కథ కంచికి వెళ్లిపోతుంది. ఒకవేళ ఇక్కడ టీడీపీ మెజారిటీ స్థానాలు గెలిస్తే అమరావతి ఉద్యమానికి అర్ధం ఉంటుంది.

 

స్థానిక సంస్థల్లో ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం ఉన్న గుంటూరులో వైసీపీ సూపర్ విక్టరీ కొడుతుందని అర్ధమవుతుంది. జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో వైసీపీ హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 17 స్థానాల్లో 15 గెలుచుకుంటే, టీడీపీ 2 చోట్ల గెలిచింది. కానీ గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీకి మద్ధతు తెలుపుతున్నారు. దీంతో టీడీపీ ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నారు.

 

దీని బట్టి చూసుకుంటే జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ హవా ఉండనుంది. ఇప్పటికే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఏకగ్రీవాల్లో వైసీపీ అదరగొట్టింది. ఏకగ్రీవమైన స్థానాల్లో మొత్తం వైసీపీ అభ్యర్ధులే ఉన్నారు. ఏదేమైనా గుంటూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయం అందుకుని అమరావతి కథని కంచికి చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: