రాజధాని ప్రాంతంలో స్థానిక ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అనధికారిక రాజధానులుగా చలామణీ అయిన గుంటూరు, విజయవాడలో గెలుపు అత్యవసరమని ఆ పార్టీ భావిస్తోంది. అయితే విజయవాడ టీడీపీ నేతలు కలిసికట్టుగా పనిచేస్తున్నా.. గుంటూరులో మాత్రం ఆ పరిస్థితి కనిపిపించడం లేదు. 

 

ఏపీ స్థానిక ఎన్నికలు రాష్ట్రమంతా ఒక ఎత్తైతే.. విజయవాడ, గుంటూరులో మరో ఎత్తుగా చెబుతున్నారు. రాజధాని తరలింపు తరుణంలో ఇక్కడి ప్రజలు అసంతృప్తిగా ఉన్నాయని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. కీలక కేంద్రాలుగా ఉన్న విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ఎన్నికల్లో ఈరెండు చోట్లా కూడా వైసీపీ గెలిస్తే.. పాలనా వికేంద్రీకరణ నిర్ణయానికి ఆమోదం ఉందని ప్రభుత్వం గట్టిగా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు ఓడితే మాత్రం రాజధాని అంశాన్ని ప్రస్తావించలేని పరిస్థితి వస్తుంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎన్నికలు జరగకపోయినా.. వాటికి దగ్గరగా ఉన్న రెండు నగరాల్లో గెలుపోటములు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. 

 

విజయవాడ విషయానికి వస్తే దాదాపు నేతలంతా ఒక తాటిపైకి వచ్చారు. మేయర్ గా ఎంపీ కేశినేని కూతురి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అర్బన్ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మద్దతిచ్చారు. నగరంలో కీలక నేతగా ఉన్న వంగవీటి రాధా కూడా ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఇక సెంట్రల్ నియోజవర్గంలో బోండా ఉమా కూడా మద్దతు తెలిపారు. దీంతో ముఖ్యనేతలంతా ఎన్నికల్లో గెలపుపై ఫోకస్ పెట్టి పని మొదలు పెట్టారు. రాజధాని తరలింపు వ్యతిరేకత తరుణంలో ఇక్కడ గెలుపు సాధ్యమేనని నేతలు చెపుతున్నారు. అటు వైసీపీలో కూడా పోటీ గట్టిగానే ఉంది. నగరంలోని మంత్రి వెల్లంపల్లి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధికార పార్టీని గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల్ని ఇంఛార్జ్ అవినాష్ సీరియస్ గా తీసుకున్నారు. 

 

అయితే గుంటూరులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీని వీడడంతో ఆ స్థానంలో కోవెల మూడి రవీంద్రకు ఇంచార్జ్ ఇచ్చారు. గుంటూరు తూర్పు స్థానానికి నజీర్ అహ్మద్ ఇంఛార్జ్ గా ఉన్నారు. వీరిద్దరి నాయకత్వంలో కార్పొరేషన్ ఎన్నికల్ని ఎదుర్కునే పరిస్థితి లేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.   ఎంపి గల్లా జయదేవ్ ఈ ఎన్నికల్లో భాగస్వామి కావడం లేదు. దీంతో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీకి నాయకత్వం వహించే వారు లేకుండా పోయారు. జిల్లాలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించకపోవడంతో.. పోటీ నామమాత్రం అవుతుందని నేతలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు ప్రజల్లో రాజధాని సెంటిమెంట్ ఉన్నా.. ముందుండి నడిపించే నేత లేకపోతే.. గెలుపు కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓడిపోతే రాజధాని స్లోగన్ కు నష్టం వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

 

రాష్ట్రంలో ఇతర స్థానాల్లో ఓడినా టీడీపీ ఏదో సమాధానం చెప్పుకుంటుంుది. కానీ గుంటూరు, విజయవాడలో ఓడిపోతే మాత్రం రాజధాని ఉద్యమంలో సెంటిమెంట్ లేదనే వాదనకు బలం చేకూరుతుంది.  ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో తమ్ముళ్లు ఏ మేరకు ఫైట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: