ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. చిత్తూరు, గుంటూరు జిల్లాలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై సీరియస్ అయింది. కొన్ని ప్రాంతాలలో నామినేషన్లు కూడా వేయనీయకపోవడంపై తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొంది. విధుల నుంచి గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు ఎస్పీలను కూడా బదిలీ చేయాలని సూచించింది. మాచర్ల, పుంగనూరు, శ్రీకాళహస్తిలలో పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. 
 
రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా ప్రభుత్వం చూడాలని ఈసీ కోరింది. ప్రభుత్వం అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయని అలాంటి ప్రాంతాలలో ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తామని ఈసీ పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఈ మేరకు ప్రకటన చేశారు. 
 
రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. పలు ప్రాంతాలలో కొందరు నేతలు బెదిరింపులకు దిగడం దారుణమని వ్యాఖ్యలు చేశారు. ఈసీ కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని ప్రకటన చేశారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, ఎస్పీలను తప్పించి కొత్త వారిని నియమించాలని సూచించారు. 
 
మాచర్ల సీఐపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. మరోవైపు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈసీ అత్యున్నత న్యాయ సమీక్ష తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి యధావిధిగా కొనసాగుతుందని రమేష్ కుమార్ చెప్పారు. ఎన్నిక ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదని స్పష్టం చేశారు. వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత సమీక్ష నిర్వహించి పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.          

మరింత సమాచారం తెలుసుకోండి: