దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 102కు చేరగా కేవలం మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31కు చేరింది. నాగపూర్, ముంబై, పుణే, యావత్మాల్ లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 100 దాటగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 
 
కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా పేర్కొనటంతో ఏపీలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ యధావిధిగా ఉంటుందని కేవలం ఎన్నికలను మాత్రమే వాయిదా వేస్తున్నామని తెలిపారు. అత్యన్నత స్థాయి సమీక్ష తర్వాత వాయిదా నిర్ణయం తీసుకొని ప్రకటన చేశామని చెప్పారు. 
 
రమేష్ కుమార్ రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎంపికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గురించి స్పష్టత ఇచ్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనవారు అలాగే కొనసాగుతారని చెప్పారు. వాళ్ల పదవులకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని అన్నారు. గెలిచిన వారితో కలిసి ఏకగ్రీవంగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
 
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తున్నామని, రద్దు చేయడం లేదని రమేష్ కుమార్ అన్నారు. పలు పార్టీలు, సామాజిక సంఘాలు ఎన్నికలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడంతో ఎన్నికలు వాయిదా వేశామని చెప్పారు. నామినేషన్ వేసిన వారిని ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉండే హక్కులు అన్నీ ఉంటాయని చెప్పారు. బ్యాలెట్ పేపర్ వల్ల కరోనా సోకే అవకాశం ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: