ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5 వేల 800 దాటింది. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లో నిన్న కరోనాతో చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు బ్రిటన్ లో అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కరోనా సోకింది. 

 

అతి పిన్న వయస్సులోనే కరోనా వైరస్ సోకిన వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన ఓ నవజాత శిశువు నిలిచింది. ప్రసవానికి కొద్ది రోజులు ముందు న్యుమోనియా సోకిందనే అనుమానంతో ఈ శిశువు తల్లిని లండన్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రసవానంతరం వచ్చిన ఫలితాల్లో ఆమెకు కరోనా ఉందని నిర్ధారణ అయింది. పుట్టిన కొన్ని నిముషాల అనంతరం శిశువుకు కూడా కరోనా పరీక్ష నిర్వహించగా...శిశువుకు కూడా ఈ వ్యాధి సోకినట్టు తెలిసింది. దీనితో తల్లీ బిడ్డలకు వేర్వేరుగా  చికిత్స అందచేస్తున్నారు. అయితే చిన్నారికి గర్భంలో ఉన్నపుడు సోకిందా లేదా పుట్టిన అనంతరమా అనే విషయాన్ని నిర్ధారించటానికి నిపుణులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

అటు యూరోప్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇటలీలో నిన్న ఒక్కరోజే 3,500 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మృతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటలీలో నిన్న ఒక్కరోజే 175 మంది చనిపోయారు. ఇటలీలో మొత్తం కేసులు సంఖ్య 20వేలు దాటింది.  స్పెయిన్ లో వెయ్యి, జర్మనీ-ఫ్రాన్స్ లో 800 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇక ఇరాన్ లో 1300 కొత్త కేసులు నమోదు కాగా.. 97 మంది చనిపోయారు. ఇరాన్ లోనూ పరిస్థితి భయంకరంగా ఉంది. 

 

కరోనా వైరస్  అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అక్కడ కేసుల సంఖ్య 2500కు చేరింది. నిన్న ఆరుగురు చనిపోవడంతో కరోనా వల్ల అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 55కు పెరిగింది. మరోవైపు ఇవాంక ట్రంప్‌తో భేటీ అయిన ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్‌ డుటన్‌కూ కరోనా సోకింది. దీంతో ఇవాంక ఇంటికే పరిమితమయ్యారు. అధ్యక్షుడికి సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆమె శుక్రవారం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. అయితే ఆమెలో వైరస్‌ లక్షణాలు ఏమాత్రం లేవని.. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆమె ఇంట్లోనే ఉన్నారని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌లోని అనేక మంది నేతల కరోనా వైద్య పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది. ఇరాన్ లోనూ అనేక మంది నేతలు, ప్రముఖులు.. కరోనా బారిన పడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: