ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారా..? ఐదురోజుల పనిదినాలు సాకుగా చూపి.. హెడ్ క్వార్టర్స్‌కు అందుబాటులో ఉండడం లేదా? రాజధానిలో ఉన్నా కూడా..  సచివాలయానికి ముఖం చాటేస్తున్నారా.. అసలు  ఏపీ పరిపాలన కేంద్రంలో ఏం జరుగుతోంది? సాక్షాత్తూ సీఎం జగన్ ఆగ్రహం చేసే పరిస్థితి ఎందుకొచ్చింది.

 

హైద‌రాబాద్ నుంచి  స‌చివాల‌యం, స‌హా అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు అమరావతికి  షిప్ట్ అయ్యి దాదాపు మూడున్నరేళ్లు అవుతోంది. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నాయి. ఫలితంగా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి త‌ర‌లివ‌చ్చిన అన్ని కార్యాల‌యాల్లో ప‌ని చేసే అదికారులు, ఉద్యోగుల‌కు ....వారానికి ఐదు రోజుల ప‌ని దినాలు అమ‌లవుతున్నాయి. అయితే ఐదు రోజులు పని దినాల‌ను సాకుగా చూపి చాలా మంది... శుక్రవార‌ం మధ్యాహ్నాం ఇంటికి బ‌య‌లుదేరి.. తిరిగి సోమ‌వారం మ‌ధ్యాహ్నానికి కార్యాల‌యాలకు చేరుకుంటున్నారు. ఇప్పటివరకూ ఇదే తంతు కొనసాగుతోంది.

 

ఐదు రోజులు ప‌ని దినాల‌ను సాకుగా చూపి.. ఐఎఎస్, ఐపీయ‌స్ అధికారులు సైతం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హైద‌రాబాద్, ఢిల్లీలో కుటుంబాలు ఉండటంతో ..శ‌ని, అదివారాలు  కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపేందుకు వెళ్తున్నారు. కీల‌క‌ భాద్యత‌ల్లో ఉన్న ఐఎఎస్, ఐపియ‌స్ అధికారులు... సిఎం జ‌గ‌న్‌కు అందుబాటులో ఉండ‌టంలేదు. మరికొంద‌రు అధికారులు  ప్రభుత్వానికి స‌మాచార‌ం ఇవ్వకుండా .. బయటకు వెళ్తున్నారు.  విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై సిఎంజ‌గ‌న్ కు ఫిర్యాదు చేశారు ప్ర‌ధాన స‌ల‌హదారు అజ‌య్ క‌ల్లం. కొందరు సచివాలయానికి రాకుండా విజయవాడ నుంచే విధులు నిర్వహిస్తున్నారని  తెలిపారు. కొందరు అధికారులు తరచుగా సెలవు మీద వెళ్తుంటే... మరికొందరు అనుమతి లేకుండా సెలవు తీసుకుంటున్నారు. అలాంటి అధికారుల‌పై సియం జ‌గ‌న్  ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లోనూ కీల‌క‌మైన అధికారులు అందుబాటులో ఉండ‌క‌పోతే ఎలా అని సియం జ‌గ‌న్ ప్రశ్నించారు. దీంతో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి నీలం సాహ్ని .. ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శులు, ముఖ్య కార్యద‌ర్శులు,  శాఖ‌ల కార్యద‌ర్శుల‌కు ప్రత్యేకంగా మోమో జారీ చేశారు. ఇకపై  రాజ‌ధానికి  అందుబాటులో ఉండాల‌ని.. రాష్ట్రం వెలుప‌ల‌కు వెళ్లే కార్యక్రమాలు మానుకోవాలని అధికారుల‌కు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.  విధిలేని పరిస్థితుల్లో ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సీఎస్ సూచించారు.

 

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల్లో  నిఘా విభాగం చీఫ్ ఉన్నట్టు తెలుస్తోంది.  అలాగే ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవ, పీయూష్ కుమార్ వంటి అధికారులు.. వీకెండ్‌లో వెళ్తున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: