జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో మ‌రోవైపు రాజ‌కీయాల్లో బిజీబిజీగా గ‌డిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌కీల్‌సాబ్ సినిమా పోస్ట‌ర్‌తో ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ పుట్టించిన ప‌వ‌న్‌... ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌తో చిన్న బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల వైపు మ‌ర‌లారు. అయితే, పాలిటిక్స్‌లో కూడా ప‌వ‌న్ కొత్త లుక్ అదిరింద‌ని అంటున్నారు. రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా కొత్త లుక్‌లో ఉండ‌టం ప‌లువురు ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంద‌ని చెప్తున్నారు. 

 


మన నుడి మన నది తెలుగు వైభవం భాషాభిమానుల ఆత్మీయ సమావేశం జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగానే ప‌వ‌న్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 6 వారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం... హింసాత్మకంగా జరిగిన నామినేషన్ ప్రక్రియను సైతం రద్దు చేసి తిరిగి చేపట్టాలని కోరారు. దాడులు, బెదిరింపులతో అప్రజాస్వామికంగా జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను రద్దు చేసి, ఎన్నికల ప్రక్రియను తాజాగా చేపట్టాలని జనసేన పార్టీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. నామినేషన్ల ప్రక్రియ భయానక వాతావరణంలో దౌర్జన్యపూరితంగా, ఏకపక్షంగా జరిగాయని ఆయ‌న ఆరోపించారు. భౌతిక దాడులు, ఆర్ధిక మూలాలు దెబ్బ తీసేందుకు ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులతో బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

 


“వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో హింస ఎక్కువైపోతుందని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు చెప్పాను. ఈనాడు ఆంధప్రదేశ్‌లో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా హింసాత్మక సంఘటనలు, పాలెగాళ్ల రాజ్యమే కనిపిస్తుంది. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కూడా రౌడీయిజం పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. అందులో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి గెలిచే అవకాశాలు ఇంకా ఎక్కువ. కానీ వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుపై భయపడుతోంది. ప్రతిపక్షాల అభ్యర్ధులను బెదిరించి, దాడులు చేసి గెలవాలని చూస్తోంది. ప్రభుత్వం ఎంత దిగజారి వ్యవహరించినా ప్రజాస్వామ్యం గొంతు నొక్కలేరు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత.`` అని ప‌వ‌న్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: