వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో దాదాపు అన్ని స్థానాల్లోనూ వైసీపీ ఏక‌ప‌క్షంగా స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాది స్తుంద‌ని పెట్టుకున్న ఆశ‌లు సొంత పార్టీ వారి చేతల కార‌ణంగా ఆవిరి అయ్యేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఇక్క‌డ టీడీపీ పుంజుకోలేదు. పార్టీ నుంచి కీల‌క నాయ‌కులు లేక‌పోవ‌డం, జంప్ చేయ‌డంతో టీడీపీ త‌ర‌ఫున జోరు క‌నిపించ‌డం లేదు. దీంతో వైసీపీ పుంజుకుంటుంద‌ని, అన్నీ ఏక‌గ్రీవాలు అవుతాయ‌ని ఆశించారు. కానీ, దీనికి భిన్నంగా ఉంది ప‌రిస్థితి. టికెట్ ఆశించి భంగ‌ప‌డిన నాయకులు రెబ‌ల్స్‌గా నామినేషన్‌లు వేశారు. దీంతో రంగంలొకి దిగిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వారిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో క‌డ‌ప వైసీపీలో ర‌గ‌డ పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



రాజంపేట నియోజకవర్గంలో సిద్దవటం జడ్పీటీసీ స్థానం టికెట్‌ను ఆ పార్టీకి చెందిన మండల కన్వీనర్‌ సింగం నీలకంఠారెడ్డి ఆశించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్‌, అనంతరం జగన్‌ వెంట నడుస్తున్నారు. 25 ఏళ్లుగా అదే పార్టీలో ఉన్నారు. జడ్పీటీసీ టికెట్‌ ఆశించారు. మరొకరికి ఇవ్వడంతో రెబల్‌ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. బద్వేలు నియోజకవర్గంలో గోపవరం జడ్పీటీసీ స్థానాన్ని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు గోపవరం ప్రభాకర్‌రెడ్డి ఆశించారు. ఆయనకు ఇవ్వకుండా వేణుగోపాల్‌రెడ్డికి అధిష్టానం టికెట్‌ ఇచ్చింది. పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తే.. ప్రస్తుతం మరొకరికి టికెట్‌ ఇస్తారా..? రెబల్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తానని టికెట్‌ ఆశించి భంగపడిన ప్రభాకర్‌రెడ్డి తేల్చిచెప్పినట్లు సమాచారం.



దీంతో ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో చిట్వేలి జడ్పీటీసీ స్థానం ఓసీ మహిళకు రిజర్వు అయింది. అక్కడ నుంచి ఆ పార్టీ నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, ఎంవీ మోహన్‌రెడ్డి ఇద్దరూ కూడా తమ కుటుంబంలో మహిళలను బరిలోకి దింపేందుకు టికెట్ ఆశించారు. ఇద్దరిలో ఒకరు మాత్రమే నామినేషన్‌ వేసేలా ఆ పార్టీ నాయకులు చర్చలు సాగించారు. చర్చలు విఫలమై తిరుగుబాటు అభ్యర్థి నామినేషను వేశారు. రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లె జడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయింది.



ఇక్కడి నుంచి డీసీసీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ లాయర్‌ ప్రభాకర్‌రెడ్డి కూడా తమ సన్నిహితులను పోటీ చేయించారు.  వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ సీనియర్‌ నాయకులు, వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితులు నల్లపుశెట్టిపల్లె గ్రామానికి చెందిన బలరామిరెడ్డి కి ఖ‌రారు చేశారు. అయితే తుమ్మలపల్లె విశ్వనాధరెడ్డి కూడా టికెట్‌ ఆశించి ద‌క్క‌క పోవ‌డంతో ఆయ‌న రెబ‌ల్‌గా నామినేష‌న్ వేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: