చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నా టైమ్ వచ్చినప్పుడు కాలితో తొక్కేస్తా, ఇది పనికిమాలిన రాజకీయం అంటూ పోలీసులపై ప్రతాపం చూపించారు. పోలీసులపై రాయలేని భాషలో విమర్శలు చేశారు. ప్రభుత్వంపై ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేశారు. పోలీసులు మాజీ మంత్రి దూషణలను రికార్డ్ చేసి ఎస్పీకి, డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. 
 
పలమనేరులోని గంగవరం మండలంలో టీడీపీ ఎంపీటీసీ నామినేషన్ వెనక్కు తీసుకోవడంతో మాజీ మంత్రి పోలీసులపై తన కోపాన్ని ప్రదర్శించారు. గంగవరం మండలం కంచిరెడ్డిపల్లికి చెందిన కామాక్షమ్మ మామడుగు ఎంపీటీసీగా నామినేషన్ వేసింది. కుటుంబ సభ్యుల సూచనల వల్ల, కొన్ని కారణాల వల్ల ఆమె నామినేషన్ ను వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆమె నామినేషన్ ఉపసంహరించుకోవడానికి వెళ్లే సమయంలో అమరనాథ రెడ్డి నామినేషన్ విత్ డ్రా చేయవద్దంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. 
 
ఆమెను టీడీపీ నాయకులు అడ్డుకోవటంతో మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే డీఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, సీఐ శ్రీధర్ సంఘటనా స్థలానికి వెళ్లి ఆమెకు రక్షణ కల్పించి ఎంపీడీవో కార్యాలయానికి పంపారు. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం మాజీ మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వైసీపీ నేతలు బలవంతంగా తమ ఎంపీటీసీ అభ్యర్థినిని విత్ డ్రా చేయించేందుకు ప్రయత్నించారని అన్నారు. 
 
తాను వెళ్లి ఎంపీటీసీ అభ్యర్థినికి మద్దతుగా నిలవటానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆమెతో నామినేషన్ విత్ డ్రా చేయించారని అన్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థిని మాజీ మంత్రి సమావేశంలో అలా వ్యాఖ్యలు చేయడంతో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో మహిళ కుటుంబ సభ్యులు నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరడంతో తాను విత్ డ్రా చేసుకున్నానని తెలిపింది. మహిళ ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాటకం బయటపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: