ఓ పక్క కరోనా భూతం ప్రపంచాన్ని వణికించేస్తోంది. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ కూడా మహమ్మారిగా గుర్తించింది. భారత్ లో వ్యవస్థలన్నీ అలర్ట్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నారు. శుభ్రత పాటించాలని ప్రజలకు విన్నవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన నెటిజన్లు మాత్రం కరోనాపై కామెడీలు ఆపడం లేదు. సీనియర్ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లో ఎన్టీఆర్ చెప్పే భారీ డైలగ్ ను పేరడీ చేసి నెట్టింట్లో వదిలారు. ఇప్పుడా డైలాగ్ విపరీతంగా వైరల్ అవుతోంది.

 

 

‘ఆగాగు.. క‌రోనాచార్యదేవా! అహ్హహ్హా ఏమంటివి? ఏమంటివి ? వైర‌స్‌ నెపమున మ‌నిషి మ‌నుగ‌డ‌కింత నిలువ‌నీడ లేదందువా? ఎంత మాటజ.. ఎంత మాట? ఇది ఉత్త ప‌రీక్షయేగానీ ఉప‌యోగ‌ప‌డే పరీక్ష కాదే? కాదు.. కాకూడదు. ఇది మ‌ర‌ణ‌ ప‌రీక్ష అందువా? ఎబోలా వైర‌స్ జ‌న‌న‌మెట్టిది? అతి జుగుప్సాకరమైన నిఫా వైర‌స్ సంభ‌వ‌మెట్టిది? మట్టిలో క‌లిసెను క‌దా? అహ్హహ్హా.. అదికాదా నీ నీతి? ఇంతయేల.. ప్రపంచ‌మంతా వ్యాపించి.. వ‌ణికించి.. క‌బ‌ళించి.. క‌కావిక‌లం చేస్తున్న మ‌హ‌మ్మారిల‌ను మేం త‌రిమేయ‌లేదా? వాటిదే ప‌రీక్ష? మాన‌వాళి భ‌విష్యత్‌ను అంధ‌కారం చేసి.. స‌క‌ల ఖండాల‌ను చుట్టబెట్టి.. కోట్లాది ప్రాణాల‌ను హ‌రించి మేం పున‌ర్ జ‌నించ‌లేదా? వాటిదే ప‌రీక్ష?

 

 

నాతో చెప్పింతువేమయ్యా.. మా వంశమునకు మూలపురుషులైన ఆదిమాన‌వులు మ‌హ‌మ్మారిని త‌ట్టుకోలేదా? అంత‌కంత‌కూ వ్యాపిస్తూ ఆందోళ‌న క‌లిగించిన అంటువ్యాధిని.. ఆ వ్యాధిని అంటిపెట్టుకొని తిరిగిన క‌ల‌రాను.. దానిని దాటేసుకుంటూ వ‌చ్చిన మ‌శూచిని.. ఆ వ్యాధికి తోడుగా వ‌చ్చిన ప్లేగును.. ఆ త‌ర్వాత వ‌చ్చిన హెచ్ఐవీని.. దానికంటే డేంజ‌రైన క్యాన్సర్‌ను.. ఆ పిద‌ప వ‌చ్చిన సార్స్‌ను.. అంత‌టితో ఆగ‌కుండా దూసుకొచ్చిన స్వైన్‌ఫ్లూను.. ఆవుల నుంచి వ‌చ్చిన క్షయ‌ను.. బాతుల నుంచి వ‌చ్చిన ఫ్లూను.. మా ఇండ్లలో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి పిల‌గాండ్లను ప‌ల‌క‌రించే ఆట‌ల‌మ్మను.. అంత‌కంత‌కూ త‌ట్టకుని బ‌తికి బ‌ట్టక‌ట్టలేదా?

 

 

సందర్భావసరములను బట్టి క్షేత్రభీజ ప్రాధాన్యములతో సంకరమైన ఈ వైర‌స్ వంశ‌ము ఏ నాడో మా చేతుల కుక్క చావు చ‌చ్చిన‌ది. కాగా నేడు క‌రోనా.. క‌రోనా అను వ్యర్థ వాద‌ములెందుకు.. ??’ అంటూ పేరడీలకు కదేదీ అనర్హం అంటూ వైరల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ పేరడీ నెట్టింట్లో బాగా షేర్ అవుతోంది. ఫోన్ లో కాలర్ ట్యూన్ వస్తున్న జాగ్రత్తలను ఖుషి, డియర్ కామ్రేడ్ లోని కొన్ని సీన్లతో పోలుస్తున్న వీడియో కూడా  వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: