కరోనా (కోవిడ్ 19) మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే దీనిని ఓ మహమ్మారిగా గుర్తించిందంటే పరిస్థితి ఎందాకా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. కరోనాతో ఎఫెక్ట్ అయిన దేశాలన్నీ తక్షణ చర్యలు తీసుకుంటూ వ్యాధి ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో ఇజ్రాయిల్ దేశం కూడా ఉంది. కరోనా మహమ్మారిని తమ దేశంలో నిర్మూలించేందుకు ఓ కొత్త ప్రయత్నాన్ని చేస్తోంది. ఇందుకోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

 

 

ఇజ్రాయెల్ లో ఉగ్రవాదుల జాడలను పసిగట్టేందుకు వాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని కరోనా నిర్మూలనకు ఉపయోగించేందుకు ఏర్పాట్టు చేస్తున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రి బెంజిమన్‌ నెతన్యాహూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెంజిమన్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజలలో కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సైబర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తామని తెలిపారు. అంతేకాకుండా.. దేశంలో కరోనా తీవ్రత తగ్గేంత వరకూ ఆర్థిక వ్యవస్థకు తాత్కాలికంగా విశ్రాంతి ఇస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్ లో ఆదివారం నాటి నుంచి అన్ని మాల్స్‌, రెస్టారెంట్లు, థియేటర్స్‌, పబ్లిక్ పార్క్స్ మూసివేస్తున్నట్లు తెలిపారు. అవసరం ఉంటేనే తప్ప ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు వెళ్లవద్దని ప్రధాని ఈ ప్రకటనలో కోరారు.

 

 

ప్రజలకు అత్యవసరాలైన పార్మసీ, మెడికల్ సేవలు, సూపర్‌ మార్కెట్లు, బ్యాంకులకు మినహాయింపును ఇస్తున్నట్టు తెలిపారు. ఇవన్నీ తమ కార్యకలాపాలను యధావిధిగా నిర్వహిస్తాయని నెతన్యాహు తెలిపారు. ప్రధాని ప్రకటనతో పాటు వైద్య అధికారులు కూడా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండొద్దని, ఒక రూంలో కేవలం పది మంది వరకూ మాత్రమే ఉండాలని అక్కడి వైద్య అధికారులు సూచిస్తున్నారు. పరిశుభ్రత ఎక్కువగా పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కూడా ప్రజలకు సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: